అమెరికా అత్తారిల్లు ఇక ఎంతమాత్రం కాదు
ఇక గ్రీన్‌కార్డు హోల్డర్లు తమ జీవిత భాగస్వాములను స్పాన్సర్ చేసే వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
By: Tupaki Desk | 14 April 2025 11:00 PM ISTఅమెరికాను తమ అత్తారిల్లుగా చేసుకోవాలని కలలు కంటున్న వారికి ఇకపై కష్టాలు తప్పేలా లేవు. అమెరికా పౌరుడిని లేదా గ్రీన్‌కార్డు హోల్డర్‌ను వివాహం చేసుకుని అక్కడికి వెళ్లాలనుకునే వారి ఆశలు అంత సులువుగా నెరవేరేలా కనిపించడం లేదు. గతంలో ఉన్నంత తేలికైన ఇంటర్వ్యూలు, త్వరితగతిన వీసా అనుమతులు ఇకపై ఉండకపోవచ్చు. అక్రమ వలసలను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు మరింత కఠినంగా అమలవుతున్నాయి. ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించడంతో ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఉన్న నిరీక్షణ సమయం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత్‌లో ఉంటూ అమెరికా పౌరుడిని వివాహం చేసుకున్న జీవిత భాగస్వామి తొలుత స్థానిక కాన్సులేట్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ గతంలో కంటే మరింత కఠినంగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటూ అమెరికా పౌరుడిని వివాహం చేసుకుంటే, వారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ కూడా అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవడం తప్పనిసరి.
అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసా (ఫామ్ ఐ-130) అనుమతి పొందడానికి దాదాపు 14 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సుమారు 3.5 నెలలకు ఇంటర్వ్యూ పూర్తవుతుంది. అంటే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 17 నుంచి 20 నెలల వరకు సమయం పట్టవచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే, పరిస్థితులను బట్టి మరింత ఆలస్యం కూడా కావచ్చు.
ఇక గ్రీన్‌కార్డు హోల్డర్లు తమ జీవిత భాగస్వాములను స్పాన్సర్ చేసే వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎఫ్2ఏ గ్రీన్‌కార్డు కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంది. ప్రస్తుతం 2022 జనవరి 1న దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే దాదాపు మూడేళ్ల నాటి దరఖాస్తులను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం గ్రీన్‌కార్డు హోల్డర్లు తమ జీవిత భాగస్వామి కోసం దరఖాస్తు చేసుకుంటే, కనీసం మరో 3 నుంచి 4 సంవత్సరాల వరకు వేచి చూడాల్సి వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా తమ పేపర్ వర్క్‌ను పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, ఇంటర్వ్యూలో అడిగే కఠినమైన ప్రశ్నలకు కూడా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఇటీవల కాలంలో వివాహానికి సంబంధించిన మరింత ఎక్కువ ఆధారాలను అమెరికా అధికారులు కోరుతున్నారని ఇమిగ్రేషన్ అధికారి అశ్విన్ శర్మ తెలిపారు. కాబట్టి, అమెరికాలో స్థిరపడాలని ఆశించేవారు ఈ కొత్త నిబంధనలు, పెరిగిన నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలను రూపొందించుకోవడం మంచిది.
