Begin typing your search above and press return to search.

అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం.. ట్రంప్ కొత్త ఆదేశాలనూ అడ్డుకున్న కోర్టు!

అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఆగస్టు 6న జారీ చేసిన కొత్త ఆదేశాలను వాషింగ్టన్ ఫెడరల్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ నవంబర్ 25న నిలిపివేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం కల్పించే విషయంలో అధ్యక్షుడు కొత్త మినహాయింపులు విధించలేరని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   26 Nov 2026 9:24 AM IST
అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం.. ట్రంప్ కొత్త ఆదేశాలనూ అడ్డుకున్న కోర్టు!
X

అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకూడదన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు మరోసారి కోర్టులో అడ్డంకి ఎదురైంది. ఆయన ఆగస్టులో తీసుకొచ్చిన కొత్త ఆదేశాలను వాషింగ్టన్ డీసీ ఫెడరల్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ నవంబర్ 25న నిలిపివేశారు.

ట్రంప్ తొలిసారి 2025 జనవరిలో జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన. అయితే ఈ నిర్ణయంపై కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. 2026 జూన్ 30న సుప్రీంకోర్టు కూడా ఆ ఆదేశాలను అమలు చేయడానికి వీల్లేదని తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత ఆగస్టు 6న ట్రంప్ మరో ఆదేశంపై సంతకం చేశారు. అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం కోసం వచ్చే విదేశీ మహిళలు, కొన్ని విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించిన వ్యక్తుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించేలా ఇందులో నిబంధనలు పెట్టారు. వాణిజ్య సరోగసీ ద్వారా పుట్టే పిల్లలను కూడా ఈ ఆదేశం పరిధిలోకి తీసుకొచ్చారు.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో జడ్జి కూపర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. అమెరికాలో పుట్టి అక్కడి చట్టాలకు లోబడి ఉండే పిల్లలకు పౌరసత్వం కల్పించే విషయంలో అధ్యక్షుడు కొత్త మినహాయింపులు తీసుకురాలేరని స్పష్టం చేశారు.

ఇప్పటికే సెప్టెంబర్‌లో మేరీల్యాండ్‌కు చెందిన మరో ఫెడరల్ జడ్జి కూడా ఈ ఆదేశాలను నిలిపివేశారు. తాజా తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది.