Begin typing your search above and press return to search.

సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్..ఇరాన్ లో ఏదో పెద్ద ఘటనే జరగబోతోంది

ఇక ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఎయిర్ స్పేస్ ను ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   17 Jun 2025 1:58 PM IST
సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్..ఇరాన్ లో ఏదో పెద్ద ఘటనే జరగబోతోంది
X

పశ్చిమాసియాలో తమ కంట్లో నలుసులా మారిన ఇరాన్ లో అమెరికా-ఇజ్రాయెల్ ఏదో పెద్ద సంచలనమే చేయబోతున్నాయి.. ప్రపంచంలో అగ్ర రాజ్యాలైన ఏడు దేశాల (జీ-7) సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థంతరంగా వీడారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో తెలిసిపోతోంది. తాజాగా ట్రంప్.. కెనడా నుంచి జీ-7 సమావేశాన్ని వీడి నేరుగా వైట్ హౌస్ లోని సిట్యుయేషన్ రూమ్ కు వచ్చేశారు. దీంతో తన వద్దనున్న అత్యంత శక్తిమంతమైన ఆయుధాలతో.. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు ట్రంప్ ఓకే చెప్పనున్నారని అనుమానిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచంలో పెను సంచలనమే.

ఇక ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఎయిర్ స్పేస్ ను ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు టెహ్రాన్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ ఆ నగర ప్రజలను హెచ్చరించారు. అంటే అర్ధం.. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఏదో భారీ దాడి చేయనున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇరాన్ లోని రెండు అణు శుద్ధి కేంద్రాలు నతాంజ్, ఫార్గో. ఇవి భూగర్భంలో అత్యంత లోతులో నిర్మించినవి. మూడు రోజుల నుంచి దాడులు జరుగుతున్నా.. ఇరాన్ అణు కేంద్రాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అధిపతి రఫాలే తెలిపారు. నతాంజ్, ఫార్గోలను చాలా లోతులో నిర్మించారు. వీటిని పేల్చివేయాలంటే మామూలు విషయం కాదు. అందుకే జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులను బయటకు తీస్తోంది అమెరికా. ఇవి అత్యంత భారీ శ్రేణి బాంబులు. బంకర్లను సైతం పేల్చేయగల సామర్థ్యం వీటి సొంతం.

ఫార్గో.. 60 శాతం పైగా యురేనియంను శుద్ధి చేయగలదు. అంటే.. దాదాపు అణుబాంబు తయారీకి దగ్గరగా ఉన్నట్లే. రెండేళ్ల కిందట అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇక్కడ 87 శాతంపైగా యురేనియాన్ని శుద్ధిచేసినట్లు గుర్తించడం గమనార్హం. అంటే 90 శాతం అణుబాంబు తయారీకి దగ్గరగా ఉన్నట్లేనని చెబుతున్నారు. ఫార్గో.. ఎక్కడో పర్వతాల్లో ఉంది. దీనిని ధ్వంసం చేయాలంటే సాధారణ బాంబులతో కాదు. మరోవైపు ఇరాన్ అణుబాంబు తయారీని ఆపాలంటే ధ్వంసం చేయడం అమెరికా, ఇజ్రాయెల్ లకు ప్రథమ కర్తవ్యం కానుంది.

అందుకే ట్రంప్.. జీ-7 సమావేశాన్ని వీడి సిట్యుయేషన్ రూమ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడినుంచే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులకు ఓకే చెప్పనున్నట్లు సమాచారం.

జీబీయూ-57 అనేది 20 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు 13,600 కిలోలు. అమెరికా బి2 స్పిరిట్ బాంబర్లతో మాత్రమే వీటిని ప్రయోగించే చాన్సుంది. ఇప్పటికే ఐదు యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో గార్సియా బేస్ కు పంపింది. ఇక తాను కాల్పుల విరమణ కంటే పెద్ద పని మీదనే జీ-7ను వీడినట్లు ట్రంప్ ప్రకటించడం ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ పెద్ద పనే పెట్టుకున్నట్లు స్పష్టం చేస్తోంది.