పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు.. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య విభేదాలు బహిర్గతం
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By: A.N.Kumar | 20 March 2026 8:00 PM ISTపశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అంతర్జాతీయ రాజకీయ యవనికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌పై సాగిస్తున్న సైనిక చర్యల్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు బహిర్గతమైంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వీరి మైత్రిలో ఇరాన్ యుద్ధ వ్యూహాల విషయంలో తలెత్తిన భేదాభిప్రాయాలు అటు దౌత్యపరంగా, ఇటు సైనికపరంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో నాటో కూటమిని నడిపించిన అమెరికా, ప్రస్తుతం ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌ను కీలక భాగస్వామిగా చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇరు దేశాల మధ్య ఏకీభావం లోపించడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు.. నేతల మృతితో మారుతున్న సమీకరణాలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న చారిత్రక వైరం ప్రస్తుతం పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదాల్చింది. ఇరాన్ భూభాగంపై జరుగుతున్న భారీ వైమానిక దాడుల్లో ఆ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ తో పాటు పలువురు అగ్రశ్రేణి సైనికాధికారులు మృతి చెందడం పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉందని తద్వారా యుద్ధ తీవ్రత ఊహించని స్థాయికి చేరుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరస్పర విరుద్ధ ప్రకటనలు.. నెతన్యాహు vs ట్రంప్
యుద్ధం కొనసాగుతుండగానే అగ్రదేశాల అధినేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తన భద్రతా నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. "అమెరికాను ఇజ్రాయెల్ యుద్ధంలోకి నెట్టిందనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అమెరికా అధ్యక్షుడికి ఏం చేయాలో చెప్పగలిగే స్థితిలో ఎవరూ లేరు " అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్ కోరిక మేరకు కాకుండా ఇరాన్ నుండి పొంచి ఉన్న ముందస్తు ముప్పును గుర్తించి తామే ఇజ్రాయెల్‌ను ఈ యుద్ధంలో భాగం చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లోని కీలకమైన గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల విషయంలో తనకు ముందస్తు సమాచారం లేదని ట్రంప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సమన్వయ లోపానికి నిదర్శనం.. సౌత్ పార్స్ ఘటన
ఇరు దేశాల మధ్య విభేదాలకు ప్రధాన కారణం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై జరిగిన దాడి. అమెరికాకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడటంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంధన వనరులపై దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అమెరికా భావిస్తుండగా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది. ఈ ఘటన తర్వాత ఇకపై ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని నెతన్యాహు హామీ ఇచ్చినట్లు సమాచారం.
భిన్నమైన యుద్ధ వ్యూహాలు
యుద్ధాన్ని నిర్వహించే పద్ధతిలో కూడా ఇరు దేశాల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. భూతల సైన్యాన్ని పంపకుండా కేవలం అత్యాధునిక వైమానిక దాడుల ద్వారా ఇరాన్ అణు, క్షిపణి వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం తన స్వయం రక్షణ కోసం ఎంచుకున్న లక్ష్యాలపై స్వతంత్రంగా విరుచుకుపడుతోంది. కేవలం అణు కేంద్రాలే కాకుండా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఇంధన కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఈ అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (చమురు) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. పశ్చిమాసియాలో అశాంతి దీర్ఘకాలం కొనసాగితే అది ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి అమెరికా–ఇజ్రాయెల్‌ల మధ్య తలెత్తిన ఈ వ్యూహాత్మక విభేదాలు యుద్ధ గమనాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
