టర్కీలో హత్యకు ఇరాన్ ప్లాన్.. అందుకే ట్రంప్ విమానం మార్చేశాడా? అమెరికా భీకరదాడులు
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలపై అమెరికా వరుసగా వైమానిక దాడులు కొనసాగిస్తోంది.
By: A.N.Kumar | 9 July 2026 10:44 AM ISTమధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌కు చెందిన కీలక సైనిక స్థావరాలపై అమెరికా వరుసగా వైమానిక దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇరాన్‌లోని 90 మిలిటరీ టార్గెట్లపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, క్షిపణులు, డ్రోన్‌ల నిల్వ కేంద్రాలు, ఇతర వ్యూహాత్మక సైనిక మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది.
హార్ముజ్ జలసంధి పరిసరాల్లో వాణిజ్య, సైనిక నౌకలపై ఇరాన్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ల ప్రధాన ఉద్దేశమని అమెరికా తెలిపింది. ఇప్పటికే ఈ నెల 7న కూడా ఇరాన్‌కు చెందిన 80 మిలిటరీ టార్గెట్లు, 60 బోట్లపై అమెరికా దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ సమావేశంలో పాల్గొన్న ట్రంప్‌ను ఓ జర్నలిస్టు ఆయన ప్రయాణ విధానంలో వచ్చిన మార్పుపై ప్రశ్నించారు. సాధారణంగా వినియోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం బదులుగా మరో విమానంలో ఎందుకు ప్రయాణించారని.. దానికి ఇరాన్ నుంచి ఉన్న ముప్పే కారణమా అని అడిగారు. దీనికి స్పందించిన ట్రంప్ "ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేను నంబర్-1 లక్ష్యాన్ని. వారు నన్ను హత్య చేయాలని భావిస్తున్నారన్న విషయం నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. చరిత్రలో ఎవరూ చేయనంత బాగా చేస్తున్నానని ఆశిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో ఆయనపై ప్రత్యక్ష దాడి చేయడం అత్యంత క్లిష్టమని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇరాన్ నుంచి వచ్చే ముప్పు నేపథ్యంలో అమెరికా సైన్యం అప్రమత్తంగా ఉందని సమాచారం.
అమెరికా వరుస దాడులు, ట్రంప్ వ్యాఖ్యలు, హార్ముజ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చమురు సరఫరాపై ప్రభావం పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా-ఇరాన్ ఘర్షణ ఎటువైపు దారితీస్తుందన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
