Begin typing your search above and press return to search.

ప్రత్యర్థి ఎవరైనా అమెరికా ఫేవరెట్ ఆయుధం ఇదే... ఏమిటీ తోమహాక్?

అయితే... అమెరికా అంబులపొదిలోని మరో క్షిపణి ఆ దేశానికి ఫేవరెట్ అని, ఆ క్షిపణి తన పని తాను చేసుకుపోయిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 11:26 PM IST
ప్రత్యర్థి ఎవరైనా అమెరికా ఫేవరెట్  ఆయుధం ఇదే... ఏమిటీ తోమహాక్?
X

తాజాగా ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికోసం బీ-2 స్టెల్త్‌ బాంబర్లను వాడినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ సమయంలో అమెరికా ఫేవరెట్ ఆయుధం గురించిన చర్చ తెరపైకి వచ్చింది. యుద్ధం ఏదైనా అమెరికా ఆ ఆయుధాన్ని ఎక్కువగా వాడుతుంటుంది.

అవును... ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడి విషయంలో ప్రపంచం మొత్తం బంకర్‌ బస్టర్‌ బాంబుల గురించి చర్చిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అమెరికా ఈ దాడికి పాల్పడక ముందు నుంచీ ఆ దేశం వద్ద మాత్రమే ఉన్నట్లు చెబుతోన్న బంకర్ బస్టర్ బాంబులపై తీవ్ర చర్చ నడిచింది. భూమిలోపల అత్యంత బలమైన స్థావరంలో ఉన్న ఫోర్డో అణుస్థావరాన్ని ధ్వంసం చేసే సత్తా ఆ బాంబులకే ఉందని కథనాలొచ్చాయి.

అయితే... అమెరికా అంబులపొదిలోని మరో క్షిపణి ఆ దేశానికి ఫేవరెట్ అని, ఆ క్షిపణి తన పని తాను చేసుకుపోయిందని అంటున్నారు. అదే... తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణి. తాజా దాడుల్లో ఇస్ఫహాన్‌, నతాంజ్‌ పై తమ సబ్‌ మెరైన్‌ సుమారు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు స్వయంగా ట్రంప్ వెల్లడించారు! దీంతో.. వీటిపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

వాస్తవానికి సుమారు మూడు దశాబ్ధాలకు పైగా చాలా యుద్ధాల్లో అగ్రరాజ్యం అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఈ క్రమంలో... ఇరాక్‌, సిరియా, గల్ఫ్‌, లిబియా, యెమెన్‌ యుద్ధాల్లో దీనిని అమెరికా విపరీతంగా వాడినట్లు చెబుతారు. అయితే.. ఈ క్షిపణి ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది.

బూస్టర్‌ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ తోమహాక్ క్షిపణి గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. సుమారు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనికి సుమారు 450 కిలోల సంప్రదాయ వార్‌ హెడ్‌ ను అమర్చవచ్చు. అమెరికా వద్ద ఉన్న 140 నౌకలు, జలాంతర్గాముల్లో దీనిని ప్రయోగించే ఏర్పాట్లు ఉన్నాయి. తొలిసారి 1970ల్లో ప్రచ్ఛన్న యుద్ధం వేళ దీని గురించిన చర్చ తెరపైకి వచ్చింది.

ఈ ఫేవరెట్ క్షిపణిని అమెరికా 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధంలో వందల సంఖ్యలో వాడగా.. ఆ తర్వాత 1998లో సూడాన్‌, అఫ్గానిస్థాన్‌ లో ఉగ్ర స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్‌ లోనూ ఉపయోగించింది. ఇదే క్రమంలో... 2003లో రెండో ఇరాక్‌ యుద్ధంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించారు. ఇక.. 2011 లిబియాలో అక్కడి ఎయిర్‌ డిఫెన్స్‌ లను పేల్చేయడానికి వీటిని విరివిగా వినియోగించారు.

ఇదే క్రమంలో... 2017లో సిరియాలో ప్రజలపై రసాయన దాడులకు ప్రతిగా.. షైరత్‌ ఎయిర్‌ బేస్‌ ను ధ్వంసం చేయడానికి అమెరికా సుమారు 57 క్షిపణులను వినియోగించగా.. ఈ ఏడాది ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడులు చేస్తున్న హుతీలను అణిచివేయడానికి ఈ తోమహాక్ లను ప్రయోగించింది. ఈ నేపథ్యలోనే తాజాగా ఇరాన్ పై 30 క్షిపణులను వదిలింది.