Begin typing your search above and press return to search.

ఇరాన్ లో చిక్కిన సైనికుడి కోసం అమెరికా చేసిన ఆపరేషన్ తెలిస్తే షాక్ అవుతారు

ఇది కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కాదు.. అమెరికా సైనిక పటిమకు, సాంకేతిక ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.

By:  A.N.Kumar   |   6 April 2026 12:28 PM IST
ఇరాన్ లో చిక్కిన సైనికుడి కోసం అమెరికా చేసిన ఆపరేషన్ తెలిస్తే షాక్ అవుతారు
X

అంతర్జాతీయ రాజకీయ యవనికపై అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న తరుణంలో అమెరికా సైన్యం చేపట్టిన ఒక సాహసోపేత ఆపరేషన్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. శత్రువుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ప్రాణాపాయంలో ఉన్న తన పైలట్‌ను అమెరికా బలగాలు సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాయి. ఇది కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కాదు.. అమెరికా సైనిక పటిమకు, సాంకేతిక ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.

అసలేం జరిగింది?

నైరుతి ఇరాన్ పర్వత ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధవిమానాన్ని ఇరాన్ రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. విమానంలోని ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటపడినప్పటికీ వారు శత్రువుల అడ్డా అయిన ఇరాన్ గడ్డపైనే ల్యాండ్ అయ్యారు. మొదటి పైలట్‌ను వెంటనే గుర్తించి రక్షించినప్పటికీ రెండో పైలట్ మాత్రం అత్యంత ప్రమాదకరమైన నిటారుగా ఉండే పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయాడు.

ఇరాన్ వేట.. అమెరికా వ్యూహం

విమానం కూలిన వెంటనే రంగంలోకి దిగిన ఇరాన్ సైన్యం.. అమెరికా పైలట్‌ను సజీవంగా పట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అతడిని పట్టుకున్న వారికి 66,100 డాలర్ల (సుమారు 55 లక్షల రూపాయలు) భారీ బహుమతిని కూడా ప్రకటించింది. ఒకవైపు ఇరాన్ వేల సంఖ్యలో సైనికులతో గాలింపు చేపడుతుండగా మరోవైపు అమెరికా తన అత్యాధునిక నిఘా వ్యవస్థను రంగంలోకి దించింది. ఉపగ్రహ నిఘా, నిశ్శబ్ద డ్రోన్లు సాయంతో 24 గంటల పాటు పైలట్ కదలికలను ట్రాక్ చేశారు.

అర్ధరాత్రి మెరుపు దాడి

పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన పెంటగాన్ అత్యవసరంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆదేశాలిచ్చింది. అర్థరాత్రి సమయంలో ఇరాన్ రాడార్ వ్యవస్థల కళ్లుగప్పి అమెరికాకు చెందిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు, ప్రత్యేక దళాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. రెండు విమానాలను అక్కడే క్లిష్టమైన పరిస్థితుల్లో ల్యాండ్ చేశారు. నిరంతరం డ్రోన్ల ద్వారా పైలట్ లొకేషన్‌ను పర్యవేక్షించారు. పైలట్ ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న క్రమంలో ఇరాన్ దళాలు అమెరికా హెలికాప్టర్లపై కాల్పులు జరిపాయి. ప్రాణాలకు తెగించి శత్రువుల కాల్పుల మధ్యే హెలికాప్టర్లను ల్యాండ్ చేసిన బలగాలు, పైలట్‌ను సురక్షితంగా ఎక్కించుకుని సరిహద్దులు దాటాయి. అయితే రెండు విమానాలను తీసుకురాలేక సైనికుడి కోసం ఏకంగా అమెరికా దళాలు ఆ రెండు విమానాలను పేల్చేశాయి. ఇరాన్ కు అమెరికా విమానాలు చిక్కకుండా ఒక్క సైనికుడి కోసం రెండు విమానాలు అమెరికా పేల్చి తమ సైనికుల ప్రాణాలే తమకు ముఖ్యమని చాటి చెప్పాయి.

"ఎవరినీ వదిలిపెట్టం" : డొనాల్డ్ ట్రంప్

ఈ మిషన్ విజయవంతమైన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడించారు. "యుద్ధభూమిలో ఏ అమెరికన్ యోధుడిని మేము ఒంటరిగా వదిలిపెట్టం. మా సైనికుడిని రక్షించుకోవడానికి ఎంతటి ప్రమాదానికైనా వెనుకాడబోమని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి స్పష్టం చేశాం" అని ఆయన గంభీరంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు.

అంతర్జాతీయంగా చర్చనీయాంశం

ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థతో అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చడం ఒక ఎత్తు అయితే ఇరాన్ గడ్డపైకి వెళ్లి తన మనిషిని అమెరికా తెచ్చుకోవడం మరొక ఎత్తు. ఇది ఇరాన్ నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని కొందరు విశ్లేషిస్తుండగా అమెరికా సాంకేతికత ముందు ఇరాన్ దళాలు తలవంచక తప్పలేదని మరికొందరు భావిస్తున్నారు.

మొత్తానికి ఇరాన్ పర్వతాల్లో జరిగిన ఈ మెరుపు ఆపరేషన్ సైనిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. "ఒక్క సైనికుడి కోసం ఇంతటి రిస్క్ అవసరమా?" అన్న ప్రశ్నకు "తమ సైనికుల ప్రాణాల కంటే విలువైంది ఏదీ లేదు" అని అమెరికా ఈ చర్యతో సమాధానమిచ్చింది.