Begin typing your search above and press return to search.

ఇరాన్ తో డీల్ కుదరకపోతే అమెరికా ప్లాన్ బి..?

అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న అణు ఒప్పంద చర్చలు అత్యంత కీలకమైన, నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో.. అగ్రరాజ్యం తన వ్యూహాలకు పదును పెంచుతోంది.

By:  A.N.Kumar   |   11 April 2026 5:01 PM IST
ఇరాన్ తో డీల్ కుదరకపోతే అమెరికా ప్లాన్ బి..?
X

పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రం మరోసారి యుద్ధ మేఘాలతో కమ్ముకుంటోంది. అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న అణు ఒప్పంద చర్చలు అత్యంత కీలకమైన, నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో.. అగ్రరాజ్యం తన వ్యూహాలకు పదును పెంచుతోంది. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై అమెరికా ఇప్పటికే “ప్లాన్-B”ని సిద్ధం చేసుకున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ అమెరికా ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.

దౌత్యం వైఫల్యమైతే.. సైనిక గర్జనే లక్ష్యం!

గత కొద్ది కాలంగా సాగుతున్న ఈ శాంతి చర్చలు ఒక కొలిక్కి వస్తాయని అంతా భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దౌత్య పరిష్కారం కోసం వాషింగ్టన్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే కఠినమైన సైనిక చర్యలకు వెనుకాడబోమని అమెరికా రక్షణ శాఖ సంకేతాలిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా చేపడుతున్న సైనిక కదలికలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ , ఒమన్ తీర ప్రాంతాల్లో అమెరికా తన అత్యాధునిక యుద్ధ నౌకలను, విమాన వాహక నౌకలను భారీగా మోహరించింది. మధ్య ప్రాచ్యంలోని అమెరికా వైమానిక స్థావరాల్లోని బాంబర్ విమానాలు, యుద్ధ విమానాలను 'హై అలర్ట్'లో ఉంచారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలకు అదనపు కమాండోలను, ఆయుధ సామగ్రిని తరలిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు కేవలం ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికే కాకుండా, చర్చలు విఫలమైన మరుక్షణమే మెరుపు దాడులకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే జరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ హెచ్చరికలతో మారిన సమీకరణాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతకు మరింత ఆజ్యం పోశాయి. ఆయన తన ప్రసంగాల్లో ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ

“మా నౌకలను ఆయుధాలతో సిద్ధం చేస్తున్నాం. శాంతియుత మార్గాలను గౌరవించకపోతే అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి అగ్రరాజ్యం సిద్ధంగా ఉంది” అని ఘాటుగా స్పందించారు. ట్రంప్ హయాంలో ఇరాన్‌పై ఉన్న కఠిన వైఖరిని ఆయన మరోసారి గుర్తు చేస్తూ ప్రస్తుతం సాగుతున్న చర్చల కంటే సైనిక సిద్ధతకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడం చర్చనీయాంశమైంది.

ప్రతిఘటనకు సిద్ధమంటున్న ఇరాన్

మరోవైపు అమెరికా చర్యలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే సహించేది లేదని అమెరికా చేసే ఏ చిన్న దాడునైనా తిప్పికొట్టే సామర్థ్యం తమకుందని టెహ్రాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల స్థావరాలను సైతం తాము లక్ష్యం చేసుకోగలమని ఇరాన్ ప్రతినిధులు పేర్కొనడం గల్ఫ్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రాంతీయ భద్రతపై నీలి నీడలు

అగ్రరాజ్యం ఒకవైపు చర్చల మేజాపై కూర్చుంటూనే మరోవైపు యుద్ధ ట్యాంకులు, నౌకలతో 'ద్వంద్వ వ్యూహాన్ని' అమలు చేస్తోంది. దీనివల్ల మధ్య ప్రాచ్యంలో సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ వంటి దేశాలు అమెరికా తదుపరి అడుగుపై నిశితంగా దృష్టి సారించాయి.

ఒకవేళ చర్చలు సఫలమైతే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. కానీ 'ప్లాన్-B' గనుక అమలైతే అది మరో భారీ ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ వాషింగ్టన్ , టెహ్రాన్ మధ్య సాగే ఈ 'మైండ్ గేమ్' ఫలితం ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి.