అమెరికాకు ఇరాన్ ఈసారి పెద్ద పనే పెట్టబోతుందా?
మరోవైపు... అమెరికా దాడులు చేసిన అణు కేంద్రాలు త్వరలో పునఃప్రారంభం కావొచ్చనే చర్చ జరుగుతుంది.
By: Tupaki Desk | 2 July 2025 10:49 PM ISTఇటీవల పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఒకెత్తు, ఈ మధ్యలోకి అమెరికా ఎంట్రీ మరొకెత్తు అన్నట్లుగా వ్యవహారం మారింది. రాత్రికి రాత్రి బంకర్ బ్లస్టర్ బాంబులతో ఇరాన్ లోని అణుకేంద్రాలపై దాడులు చేసిన అమెరికా... అనంతరం కాల్పుల విరమణకు ఒప్పించింది.
ఆ కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్ - ఇరాన్ కంటే ఎక్కువగా.. అమెరికా – ఇరాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ పెద్దల నుంచి, సుప్రీం లీడర్ ఖమేనీ వరకూ ట్రంప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు, హెచ్చరికలు చేశారు. మరోవైపు... అమెరికా దాడులు చేసిన అణు కేంద్రాలు త్వరలో పునఃప్రారంభం కావొచ్చనే చర్చ జరుగుతుంది.
అవును... అమెరికా దాడులతో ఇరాన్ కు అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యం పోయిందని, ఇకపై ఆ దేశం అలాంటి సాహసం చేయదని, ఒకవేళ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో.. ప్రముఖ శాటిలైట్ ఇమేజింగ్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన చిత్రాలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇందులో భాగంగా... ఫోర్డో అణు కేంద్రం ఉన్న కొండ ప్రాంతంలోకి ఒక కొత్త రహదారిని నిర్మించారని.. దాడులు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే తవ్వకానికి వాడే యంత్రాలు, భారీ క్రేన్లు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అమెరికా దాడుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, లోపల ఉన్న పరిస్థితిని పరిశీలించడానికి ఇరాన్ ఈ పనులు చేపడుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో... అణుకేంద్రాల లోపలికి సిబ్బందిని, పరికరాలను పంపే ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐ.ఎస్.ఐ.ఎస్.) విశ్లేషించింది. ఇదే క్రమంలో... తాజా చిత్రాలను బట్టి చూస్తే ఇరాన్ ఇంజనీరింగ్ బృందాలు అక్కడ గుంతలు పూడ్చడం, రేడియోలాజికల్ నమూనాలను సేకరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాయని తెలుస్తోందని చెబ్బుతున్నారు.
కాగా... బంకర్ బ్లస్టర్ బాంబులతో అమెరికా చేసిన దాడులు ఇరాన్ ను దశాబ్దాల వెనక్కి నెట్టేశాయని కొందరు నిపుణులు చెబుతున్నప్పటికీ.. అందుకు పూర్తి భిన్నమైన వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేవని.. ఇరాన్ తలుచుకుంటే కొన్ని నెలల్లోనే మళ్లీ యురేనియం శుద్ధిని ప్రారంభిస్తుందని ఐ.ఏ.ఈ.ఏ. డైరెక్టర్ జనరల్, రాఫెల్ గ్రోస్సీ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో... ఇరాన్ త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు.. ఒకవేళ ఇరాన్ అంత సాహసమే చేస్తే అమెరికాకు పెద్ద పనే పెట్టినట్లు అవుతుందని.. దీంతో, పశ్చిమాసియా మరోసారి రగిలిపోయే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు.
