Begin typing your search above and press return to search.

అమెరికా-ఇరాన్ ఇరు దేశాలు గెలిచాయా? మరి ఓడింది ఎవరు?

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన 38 రోజుల భీకర పోరులో ఇరు దేశాలు తమంటే తామే గెలిచామని ఛాతి చరుచుకున్నా.. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి ఒరిగింది ఏమీ లేదు..

By:  Tupaki Political Desk   |   8 April 2026 11:33 AM IST
అమెరికా-ఇరాన్ ఇరు దేశాలు గెలిచాయా? మరి ఓడింది ఎవరు?
X

గెలుపు ఎవరిదైనా.. దెబ్బతినేది మాత్రం సగటు మనిషి బతుకే! పరువు కోసం పాకులాడే పాలకులు యుద్ధ నినాదాలు చేస్తే, దాని ఫలితం పెరిగిన పెట్రోల్ ధరలు, ఖాళీ అవుతున్న గ్యాస్ సిలిండర్లు, అదుపు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థల రూపంలో సామాన్యుడిని వెంటాడుతూనే ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన 38 రోజుల భీకర పోరులో ఇరు దేశాలు తమంటే తామే గెలిచామని ఛాతి చరుచుకున్నా.. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి ఒరిగింది ఏమీ లేదు..

హార్ముజ్ అతిపెద్ద ముప్పు..

దాదాపు హార్మూజ్ జలసంధి నుంచే గల్ఫ్ దేశాలు ప్రపంచానికి చమురు, గ్యాస్ సరఫరా చేస్తుండేవి. యుద్ధం ముందు వరకు ఈ జలసంధి నుంచి నౌకల రవాణా సాఫీగా సాగేది. ప్రపంచానికి అవసరమైన ఆయిల్, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. కానీ, ఫిబ్రవరి 28న యుద్ధం మొదలవ్వగానే ఇరాన్ వ్యూహాత్మకంగా హార్ముజ్‌ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి పెను సంక్షోభం మొదలైంది. ఒక చిన్న సముద్ర మార్గం మూతపడితే ప్రపంచం ఎంతలా వణికిపోతుందో ఈ 38 రోజులు కళ్లకు కట్టినట్లు చూపించాయి.

సీజ్‌ఫైర్ పంతం

ప్రస్తుతం కుదిరిన సీజ్‌ఫైర్ (యుద్ధ విరమణ) ఒప్పందంలో ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లే కనిపిస్తోంది. ఇకపై తమ ఆర్మీ పర్యవేక్షణలోనే హార్ముజ్ ద్వారా రాకపోకలు సాగుతాయని ఇరాన్ కఠినమైన షరతు పెట్టింది. ఇది అమెరికా ఆధిపత్యానికి గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా కూడా తమ లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకుంటూ పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే ఇరాన్ పట్టు బిగించినట్లు స్పష్టం అవుతోంది.

ప్రపంచ దేశాల ఆందోళన

ఈ 38 రోజుల యుద్ధం వల్ల చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థలు స్తంభించాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ గందరగోళం నుంచి దేశాలు పడేందుకు ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యాల అహంకారానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.

సామాన్యుడికే భారీగా నష్టం..

అమెరికా- ఇరాన్ దేశాలు తామంటే తాము గెలిచామని గెలుపు పాటలు పాడుకుంటున్నాయి. అయితే యుద్ధంలో ఓడింది ఎవరు? నిజానికి ఈ యుద్ధంలో ఓడింది సామాన్యుడే. యుద్ధం తెచ్చిన ఇంధన కొరత, పెరిగిన ధరల భారాన్ని ప్రపంచం ఇంకా మోయాల్సిందే. రాజకీయంగా ఎవరు పైచేయి సాధించినా, యుద్ధం వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడం తేలికైన విషయం కాదు. దేశాల పరువు కోసం చేసే పోరాటాలు సామాన్యుడి పొట్ట కొట్టడమే తప్ప మరేమీ సాధించలేవని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.

యుద్ధం ఎప్పుడూ సమస్యలకు పరిష్కారం కాదు.., అది కొత్త సమస్యలకే నాంది పలుకుతుంది. ట్రంప్ తన వ్యూహం ఫలిస్తుందని భావించినా, అంతిమంగా అది ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. ఇరాన్ కూడా తన పట్టు కోసం ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పోరాటంలో ఇరు దేశాలు ‘విక్టరీ’ సింబల్స్ చూపిస్తున్నా, ఆ నీడలో సగటు మనిషి పడుతున్న కష్టాలు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. ఈ సంక్షోభం నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకుంటుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.