Begin typing your search above and press return to search.

ఇండి పేరు తీసేసి.. పాక్ లో కలిపేసి.. అమెరికాకు కండకావరం ఎక్కేసింది..

పేరు మార్పు ఒక ఎత్తయితే ఈ కమాండ్ పరిధిని వివరిస్తూ అమెరికా విడుదల చేసిన అధికారిక మ్యాప్ దేశంలో తీవ్ర దుమారం రేపింది.

By:  A.N.Kumar   |   17 Jun 2026 8:00 PM IST
ఇండి పేరు తీసేసి.. పాక్ లో కలిపేసి.. అమెరికాకు కండకావరం ఎక్కేసింది..
X

అమెరికా రక్షణ శాఖ తీసుకున్న ఒక తాజా నిర్ణయం అంతర్జాతీయ దౌత్య వర్గాలతో పాటు.. భారత సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. భారత్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తిస్తూ గతంలో మార్చిన అమెరికా అతిపెద్ద సైనిక కమాండ్ పేరును ఇప్పుడు మళ్లీ పాత పేరుకే మార్చడం గమనార్హం. అంతేకాదు ఈ సందర్భంగా విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం భారత్‌లో తీవ్ర విమర్శలకు, ఆందోళనలకు కారణమవుతోంది.

‘ఇండో’ తొలగింపు.. పాత పేరుకే మొగ్గు

అమెరికా రక్షణశాఖ (పెంటగాన్) తాజాగా "యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్" పేరును మళ్లీ "యూఎస్ పసిఫిక్ కమాండ్" గా మారుస్తున్నట్లు ప్రకటించింది. చారిత్రక వారసత్వాన్ని గౌరవించడం, పసిఫిక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని పెంపొందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ వివరణ ఇచ్చింది.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ప్రాంతీయ స్థిరత్వం కోసం 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమన్ ఈ పసిఫిక్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. కొరియా, వియత్నాం యుద్ధాలతో పాటు అనేక మానవతా సహాయక కార్యక్రమాల్లో ఈ కమాండ్ కీలక పాత్ర పోషించింది.

2018లో మార్పు.. ఇప్పుడు రివర్స్

హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక అనుసంధానాన్ని ప్రాంతీయ భద్రతలో భారత్ పాత్రను గుర్తిస్తూ 2018లో అప్పటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ ఈ కమాండ్ పేరును "ఇండో-పసిఫిక్"గా మార్చారు. డొనాల్డ్ ట్రంప్ తొలి హయాంలో జరిగిన ఈ మార్పు భారత్-అమెరికా రక్షణ బంధంలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలోనే ఎనిమిదేళ్ల తర్వాత ఆ పేరు నుండి ‘ఇండో’ను తొలగించడం సరికొత్త వ్యూహాత్మక చర్చలకు దారితీసింది.

మ్యాప్ వివాదం.. భారత్‌కు అమెరికా షాక్?

పేరు మార్పు ఒక ఎత్తయితే ఈ కమాండ్ పరిధిని వివరిస్తూ అమెరికా విడుదల చేసిన అధికారిక మ్యాప్ దేశంలో తీవ్ర దుమారం రేపింది. ఈ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం గమనార్హం. జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమని, పీఓకే పై భారత్‌కు పూర్తి సార్వభౌమాధికారం ఉందని ఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారిక మ్యాప్‌లో పీఓకేని పాకిస్థాన్‌లో చూపించడం దౌత్యపరంగా భారత్‌కు గట్టి షాక్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు అమెరికా ద్వంద్వ నీతిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

క్వాడ్ కూటమి అంతానికి సంకేతమా?

ఈ పరిణామంపై రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్ర స్పందన వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ ఇది "క్వాడ్ అంతానికి మరో మేకు" అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి భవిష్యత్తుపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కేవలం పరిపాలనా పరమైన నిర్ణయమేనా?

అమెరికా అధికారిక వర్గాలు మాత్రం ఇది కేవలం చారిత్రక పేరును పునరుద్ధరించే ఒక పరిపాలనా నిర్ణయమేనని.. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ భారత్-అమెరికా అగ్రనేతల భేటీకి ముందు ఈ పేరు మార్పు, పీఓకే మ్యాప్ వివాదం తెరపైకి రావడం అంతర్జాతీయ దౌత్య రంగంలో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా నిజంగానే తన వ్యూహాన్ని మార్చుకుందా లేదా అనేది మున్ముందు తేలనుంది.