అమెరికా సుంకాలతో భారత టెక్స్‌టైల్ పరిశ్రమపై ప్రభావం తప్పదా?
భారత టెక్స్‌టైల్ రంగం మరోసారి సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన పరిశ్రమ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 Aug 2025 3:00 PM ISTభారత టెక్స్‌టైల్ రంగం మరోసారి సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన పరిశ్రమ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఇటీవల భారత వస్త్రాలపై దిగుమతి సుంకాన్ని 50 శాతం వరకు పెంచడం వల్ల, వచ్చే ఆరు నెలల్లో దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో దాదాపు 25 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
అతిపెద్ద మార్కెట్ అమెరికా..
అమెరికా భారత్‌కు అతిపెద్ద వస్త్ర, దుస్తుల మార్కెట్. ఇప్పటికే అక్కడి దిగుమతిదారులు ఆర్డర్లను రద్దు చేయడం ప్రారంభించారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ పోటీలో నిలబడటానికి ఈ అధిక సుంకాలు పెద్ద అడ్డంకిగా మారతాయని స్పష్టమవుతోంది. అయితే, ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పత్తి దిగుమతులపై సుంకం రాయితీని కొనసాగించడం కొంత ఊరట కలిగించే అంశం
20 నుంచి 25 శాతం నష్టాలు తప్పవా?
ఎగుమతిదారులు వ్యూహాలు మార్చుకున్నప్పటికీ, కనీసం 20 నుంచి 25 శాతం వరకు నష్టాలు తప్పవని, మార్కెట్ మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చేయకపోతే ఈ నష్టం 28 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలో పత్తి ధరలు ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే 10–15 శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎగుమతిదారులు పోటీ లో వెనుకబడుతున్నారు." అయితే పత్తి దిగుమతులపై సుంకం రద్దు చేయడం వలన ఈ ధర వ్యత్యాసం తగ్గి, భారత వస్త్రాలకు కొంత పోటీ సామర్థ్యం పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనా?
అమెరికా భారత టెక్స్‌టైల్ రంగానికి కీలకమైన మార్కెట్. సుంకాల పెంపు తీవ్ర సమస్యలకి దారి తీస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం సహకారం అందిస్తుందని నమ్మకం ఉంది. కానీ దీర్ఘకాలికంగా చూస్తే మనం ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. "అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడకుండా ఉండేందుకు, ఇతర దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అపారెల్ ఎగుమతుల మండలి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా నిర్ణయం తక్షణ ప్రభావం చూపుతున్నప్పటికీ, సరైన విధానపరమైన మార్పులు చేస్తే భారత టెక్స్‌టైల్ పరిశ్రమ ఈ సవాళ్లను అధిగమించే అవకాశముందని పరిశ్రమ నిపుణులు నమ్ముతున్నారు.
