Begin typing your search above and press return to search.

అమెరికా గో బ్యాక్ ప్రకటన : భారత్, చైనా ఫొటోలపై ఆగ్రహం

అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన వలస విధానం అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా భారతీయుల మధ్య తీవ్ర చర్చకు.. వివాదానికి దారితీసింది.

By:  A.N.Kumar   |   18 March 2026 8:32 PM IST
అమెరికా గో బ్యాక్ ప్రకటన : భారత్, చైనా ఫొటోలపై ఆగ్రహం
X

అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన వలస విధానం అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా భారతీయుల మధ్య తీవ్ర చర్చకు.. వివాదానికి దారితీసింది. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) చేపట్టిన ఈ "స్వచ్ఛంద తిరుగు ప్రయాణ" ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా కొత్త వలస ప్రచారంపై వివాదాలు

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపే క్రమంలో ప్రభుత్వం ఒక వినూత్నమైన కానీ వివాదాస్పదమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళే వలసదారులకు ఉచిత విమాన టికెట్‌తో పాటు సుమారు 2,600 డాలర్ల (దాదాపు రూ. 2.15 లక్షలు) వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది.

తాజ్ మహల్ పోస్టర్.. భారతీయుల ఆగ్రహం

ఈ ప్రచారంలో అత్యంత వివాదాస్పద అంశం భారతదేశం కోసం రూపొందించిన ప్రకటన. “Fly to India for Free” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌లో భారతదేశ వైభవానికి ప్రతీక అయిన తాజ్ మహల్ చిత్రాన్ని ఉపయోగించారు. ఒక సున్నితమైన వలస సమస్యను పరిష్కరించే క్రమంలో ఇటువంటి సాంస్కృతిక చిహ్నాలను వాడటంపై భారతీయులు మండిపడుతున్నారు. ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని, వలసదారుల దీనస్థితిని తక్కువ చేసి చూపడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చైనాకు కూడా అక్కడి సాంస్కృతిక చిహ్నంను వాడడంపై చైనీయులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ లక్ష్యాలు..గత అనుభవాలు

అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమం వెనుక మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. బలవంతపు డిపోర్టేషన్ (బహిష్కరణ) ప్రక్రియలో అయ్యే భారీ ఖర్చును తగ్గించడం...ఇమ్మిగ్రేషన్ కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించడం.. స్వచ్ఛందంగా వెళ్లే వారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా అమెరికా వచ్చే అవకాశం కల్పించడం ఉద్దేశంగా ఉంది. అయితే ఇటువంటి ప్రయత్నం గతంలో డొనాల్డ్ ట్రంప్ చేశాడు. అప్పట్లో $1,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించినప్పటికీ చాలా మందికి ఆ నగదు అందలేదని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పథకంలో కూడా అదే తరహా అస్పష్టత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వలస సమస్య అనేది కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు.. అది మానవీయ రాజకీయ అంశాలతో ముడిపడి ఉంది. కేవలం డబ్బు ఆశ చూపి లేదా సాంస్కృతిక చిహ్నాలను వాడుతూ వలసదారులను పంపాలనుకోవడం క్షేత్రస్థాయిలో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి. ముఖ్యంగా చైనా, కొలంబియా వంటి దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇటువంటి పోస్టర్లు విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.