Begin typing your search above and press return to search.

భారతీయ వలసదారులకు కొత్త తలనొప్పి..ట్రావెల్ ఏజెంట్లపై ట్రంప్ కొరడా!

అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశానికి భారతీయ ట్రావెల్ ఏజెంట్ల దురాశే కారణమని అమెరికా ప్రభుత్వం పదే పదే నొక్కి చెబుతోంది.

By:  Tupaki Desk   |   22 May 2025 11:03 AM IST
భారతీయ వలసదారులకు కొత్త తలనొప్పి..ట్రావెల్ ఏజెంట్లపై ట్రంప్ కొరడా!
X

అమెరికాలో వలస విధానాలపై నెలకొన్న ఉద్రిక్తత, ముఖ్యంగా భారతీయ సమాజంపై దాని ప్రభావంపై విస్తృత చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో 'అమెరికా ఫస్ట్' నినాదం, అక్రమ వలసలను కట్టడి చేయాలనే లక్ష్యం, వేలాది మంది భారతీయుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు, చట్టబద్ధమైన హెచ్-1బీ వీసాలపైనా చర్చలు రాజుకోవడం ప్రస్తుత పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.

అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశానికి భారతీయ ట్రావెల్ ఏజెంట్ల దురాశే కారణమని అమెరికా ప్రభుత్వం పదే పదే నొక్కి చెబుతోంది. ఇది కేవలం వలస సమస్య కాదని, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి వీసా ఆంక్షలు విధించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ చర్యలు కేవలం వలసలను నిరోధించడమే కాకుండా అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛేదించాలనే విస్తృత లక్ష్యంలో భాగంగా ఉన్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎవరైతే చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తారో, వారికి కఠిన శిక్షలు తప్పవని అమెరికా స్పష్టం చేస్తోంది. అక్రమంగా అమెరికాలోకి రావాలని చూస్తున్న వారికి, అందుకు సహకరిస్తున్న వారికి ఇది గట్టి హెచ్చరిక.

అక్రమ వలసలతో పాటు, అమెరికాలో శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్న మరో అంశం హెచ్-1బీ వీసాలు. సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే ఈ వీసాలు, భారతీయ నిపుణులకు అమెరికాలో పని చేసేందుకు మార్గం సుగమం చేస్తాయి. అయితే, అమెరికాలో కొంతమంది అతివాదులు, ఈ వీసాల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దక్కడం లేదని వాదిస్తూ, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ మరింత వేడెక్కుతోంది. "అక్రమ వలసదారులను బయటకు పంపడం సరే, మరి హెచ్-1బీ వీసాల సంగతేంటి?" అని లారా ఎలిజబెత్ లూమర్ వంటివారు ప్రశ్నిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ వీసాల ద్వారా టెక్ కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని, ఇది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు దక్కేలా.. "అమెరికాను అమ్మకానికి పెట్టొద్దు" అని ట్రంప్ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సంక్లిష్ట పరిస్థితులు అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, భవిష్యత్తులో వలస విధానాలు ఏ దిశగా సాగుతాయో వేచి చూడాలి.