Begin typing your search above and press return to search.

అమెరికా వేల విమానాలకు షట్ డౌన్ ఎఫెక్ట్... ఏ రేంజ్ లో అంటే..!

తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికాలో షట్‌ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Oct 2025 2:30 PM IST
అమెరికా వేల విమానాలకు షట్ డౌన్ ఎఫెక్ట్... ఏ రేంజ్ లో అంటే..!
X

తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికాలో షట్‌ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో.. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే.. మిలిటరీ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో విమానాలకు బిగ్ ఎఫెక్ట్ పడింది.

అవును... సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికాలో షట్‌ డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో... అగ్రరాజ్య వ్యాప్తంగా ఆదివారం సుమారు 8వేలకు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ షట్‌ డౌన్‌ కారణంగా చాలాచోట్ల ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన అమెరికా రవాణా శాఖ మంత్రి శాన్ డఫీ మాట్లాడుతూ... ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది కొరత ఏర్పడిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. దీంతో పలు విమానాల ఆలస్యం, మరికొన్ని సర్వీసుల రద్దు మరింత పెరగొచ్చని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో స్పందించిన ఎయిర్ లైన్స్ ఫర్ అమెరికా... విమానయానం చేయడం సురక్షితమే, కానీ ఏటీసీ సిబ్బంది కొరత వ్యవస్థను దెబ్బతీస్తుందని.. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుందని.. ప్రతిదీ నెమ్మదిస్తుందని తెలిపింది. ఇదే సమయంలో.. కొన్ని సందర్భాల్లో విమానాలు ఆలస్యం కావచ్చు లేదా రద్దు చేయబడవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో... సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ లో 45శాతం అంటే సుమారు 2వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో... అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన 1200, యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన 739, డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో... అమెరికాలో అత్యంత రద్దీ అయిన లాస్‌ ఏంజెలెస్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులో సిబ్బంది కొరత కారణంగా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. దీంతో.. ఈ ఎయిర్‌ పోర్టుకు వెళ్లే విమానాలను కొంత సేపు నిలిపివేశారు. ఫలితంగా సుమారు రెండు గంటల పాటు ఈ ఎయిర్‌ పోర్టుకు విమానాలు వెళ్లలేదు. ఇదే సమయంలో... వాషింగ్టన్‌, న్యూ జెర్సీ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లోనూ ఈ సమస్య నెలకొందని అధికారులు వెల్లడించారు.

కాగా... అక్టోబరు 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌ డౌన్‌ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 1981 నుంచి అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకూ 15 సార్లు మూతపడింది. ఈ క్రమంలో... 2018-19 మధ్య సుమారు 35 రోజుల పాటు మూతపడగా.. నాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌ డౌన్‌ కాగా.. ఈసారి షట్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందనేది వేచి చూడాలి!