అమెరికా వ్యథలు : ఇలా విద్యార్థి వీసా అప్రూవ్.. అలా రిజెక్ట్
కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎటువంటి ఇమెయిల్ లేకుండా కారణం తెలియజేయకుండానే వారి వీసా స్థితి మళ్లీ “Refused” (నిరాకరించబడింది)గా మార్చబడింది.
By: Tupaki Desk | 11 July 2025 10:34 PM ISTఅమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు కల్లలవుతున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా ప్రక్రియ చుక్కలు చూపిస్తోంది. ఈ ప్రక్రియలో “వీసా ఆమోదం” అనే స్థితిని చూడటం అత్యంత సంతోషకరమైన క్షణంగా మారింది.. అయితే ఇప్పుడు ఆ సంతోషం కూడా నమ్మలేని పరిస్థితిని సృష్టించింది.
ఇటీవల ఒక Reddit యూజర్ తన ఆశ్చర్యకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. వారి వీసా కొన్ని వారాలుగా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌లో ఉండగా అకస్మాత్తుగా “Approved” అని స్థితి మారిందట. మూడు వారాల క్రితమే 221(g) నోటీసు అందిందని, భయంతో తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ పబ్లిక్‌గా మార్చానని వారు పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ, కొత్త స్క్రీనింగ్ విధానం అమలులోకి రావడానికి ముందే జరిగింది.
కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎటువంటి ఇమెయిల్ లేకుండా కారణం తెలియజేయకుండానే వారి వీసా స్థితి మళ్లీ “Refused” (నిరాకరించబడింది)గా మార్చబడింది. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. “Approved” నుండి “Refused”కి, లేక మళ్లీ “Administrative Processing”కి తిరిగి వెళ్ళడం వంటి స్టేటస్ మార్పులు మరికొంతమంది విద్యార్థులకు కూడా ఎదురయ్యాయి.
ఇక్కడ విచిత్రమేమంటే.. ఈ మార్పులు ఏమైనా కొత్త సమస్యల వల్ల జరగడం లేదు. అమెరికాలో వీసా వ్యవస్థ అస్థిరంగా మారడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. "Approved" అనే స్థితి అంటే వీసా పూర్తిగా ముద్రించబడిందని అర్థం కాదు. అది కేవలం ఒక దశ పూర్తయిందని మాత్రమే. కానీ ఈ లోతైన వివరాలు విద్యార్థులకు ఎవరు వివరిస్తారన్నది ప్రశ్న.
"Refused" అయినప్పటికీ వీసా ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉందని గతంలో భావించేవారు. ఇప్పుడు "Approved" అయినా కూడా మళ్లీ ప్రాసెసింగ్‌లోకి వెళ్తుందంటే, అసలు విశ్వసనీయతే లేకుండా పోతోంది.
ఈ విధంగా విద్యార్థుల నమ్మకాన్ని పెంచి, అర్ధాంతరంగా వారి ఆశలను విచ్ఛిన్నం చేయడం కేవలం నిర్లక్ష్యమే కాదు.. ఇది అమానుషంగా మారుతోంది.
ఇటువంటి సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలని, స్పష్టతతో పాటు విద్యార్థుల మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం అమెరికా అధికారులకు ఉందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
