అగ్రరాజ్యం వితండవాదం.. భారత్ ఎప్పుడూ ఆరో వేలే!
ప్రపంచ ఉగ్ర మూలాలు వెతికితే అందులో పాక్ జాడలు ఇట్టే కనిపిస్తాయి. అంతలా ఉగ్రభూతాన్ని పెంచి పోషించే పాక్ ను అమెరికా ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.
By: Tupaki Desk | 19 Jun 2025 11:19 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ పంచాయితీ తెలిసిందే. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకుంటుందని.. అది ప్రపంచానికి ప్రమాదకరమన్నది ఇజ్రాయెల్.. అమెరికా వాదన. ఇందులో నిజమెంత? అబద్ధమెంత? అన్నది చర్చ కానే కాదు. ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కితే.. ప్రపంచం మీద పడే ప్రభావాన్ని అంచనా వేసి.. ఆగమాగం అవుతున్న అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ ను ఎందుకు నిలువరించలేదు? అన్నది ప్రశ్న.
అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విషాదంగా ట్విన్ టవర్స్ పై ఉగ్రదాడిని చెప్పుకోవచ్చు. ఈ దారుణ ఉదంతంలో వందలాది అమెరికన్ల ప్రాణాలు పోవటం తెలిసిందే. అందుకు ప్లాన్ చేసిన బిన్ లాడెన్ ఆశ్రయం పొందింది ఎక్కడ? పాకిస్థాన్ లో. పాక్ కు తెలీకుండానే లాడెన్ పాక్ లో మనుగడ సాగించగలడా? అన్న ప్రశ్నకు చిన్న పిల్లాడు సైతం సమాధానం చెప్పేస్తాడు. అలాంటప్పుడు అన్ని తెలిసిన అగ్రరాజ్యం ఏమీ తెలీనట్లు ఎందుకు ఉంది?
లాడెన్ ను పాక్ గగనతలంలోకి వెళ్లి వైమానిక దాడులు చేపట్టి హతమార్చటం తెలిసిందే. అయితే.. పాక్ మీద ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు? మా దేశస్తుల ప్రాణాలు తీసినోళ్లకు ఆశ్రయం కల్పిస్తావా? అంటూ ఎందుకు రంకెలు వేయలేదు? కన్నెర్ర చేయకపోవటం ఏమిటి? ఆంక్షల కత్తిని దూసి పాక్ ను ఆగమాగం ఎందుకు చేయలేదు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. పాక్ విషయంలో అన్ కండీషనల్ లవ్ ను ప్రదర్శించే అమెరికా.. భారత్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కండీషన్లతో కూడిన అభిమానాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తుందన్నది నిజం.
ప్రపంచ ఉగ్ర మూలాలు వెతికితే అందులో పాక్ జాడలు ఇట్టే కనిపిస్తాయి. అంతలా ఉగ్రభూతాన్ని పెంచి పోషించే పాక్ ను అమెరికా ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ఎంత వ్యూహాత్మక భాగస్వామి అయినా.. భారత్ తో పోలిస్తే పాక్ ను విశ్వసించలేకున్నా.. పాక్ వైపు మొగ్గు చూపే అగ్రరాజ్యం తీరును చూస్తే.. దాని డబుల్ టంగ్ ఇట్టే అర్థమవుతుంది. నాగరిక ప్రపంచంలో ఎవరు ఎవరి మీదా అజమాయిషీ ప్రదర్శించకూడదని అనుకున్నా.. అగ్రరాజ్యం మాత్రం ఎప్పుడూ తన ఇష్టానికి తగ్గట్లే ప్రపంచం ఉండాలన్నట్లు వ్యవహరించటం చూస్తున్నాం.
తనకు నచ్చిన దివంగత ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ఏం చేశారో ప్రపంచానికి తెలిసిందే. ఎంత సంపన్న దేశమైతే మాత్రం ప్రపంచం మీద ఇంత పెత్తనమా? అన్న ప్రశ్న మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఇరాన్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పాక్ విషయంలో మాత్రం ఎక్కడలేని అభిమానాన్ని ప్రదర్శించటం చూస్తే..దాని డబుల్ స్టాండర్స్ ఇట్టే అర్థమవుతాయి. ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతల వేళ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు విందు ఏర్పాటు చేయటం.. అందులో ట్రంప్ పాల్గొనటం చూసినప్పుడు.. కుట్రలు.. కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పాక్ విషయంలో అమెరికా ప్రదర్శించే అభిమానం చూసినప్పుడు అగ్రరాజ్యం పక్షపాతం మరోసారి కళ్లకు కట్టినట్లుగా కనిపించకమానదు.
