వాషింగ్టన్ కు "డూమ్స్ డే ప్లేన్"... యుద్ధంలో కొత్త మలుపుకు సిద్ధం!?
విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ-4బీ మేరీల్యాండ్ లో దిగే ముందు వర్జీనియా, నార్త్ కరోలినా చుట్టూ తిరిగిందని తేలింది.
By: Tupaki Desk | 20 Jun 2025 12:00 AM ISTపశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అమెరికాలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పై యూఎస్ దాడులకు సిద్ధపడుతోందనే చర్చ జరుగుతోన్న వేళ.. అమెరికాకు చెందిన 'డూమ్స్ డే' విమానాలలో ఒకటైన బోయింగ్ 'ఈ-4బీ నైట్ వాచ్' వాషింగ్టన్ సమీపంలోని మేరీల్యాండ్ లో జాయింట్ బేస్ ఆండ్రూస్ కు ప్రయాణించింది!
అవును... సాధారణంగా అణు వివాదం లేదా జాతీయ అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఎగిరేలా.. సైనిక కమాండ్ సెంటర్ గా పనిచేయడానికి రూపొందించబడిన ఈ విమానం.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు లూసియానాలోని బోసియర్ సిటీ నుండి బయలుదేరి రాత్రి 10 గంటల తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ లో ల్యాండ్ అయిందని న్యూయార్క్ పోస్ట్ నివేదికలు తెలిపాయి.
విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం ఈ-4బీ మేరీల్యాండ్ లో దిగే ముందు వర్జీనియా, నార్త్ కరోలినా చుట్టూ తిరిగిందని తేలింది. దీనికితోడు.. సాధారణ ఆర్డర్-6 కంటే.. ఆర్డర్-1 అనే కాల్ సైన్ ను ఉపయోగించడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో.. ఈ వ్యవహారం ఆన్ లైన్ లో ఊహాగానాలకు దారితీసింది. కొంతమంది పరిశీలకులు ఈ మిషన్ సాధారణం కాదని సూచిస్తున్నారు.
ఏమిటీ 'ఈ-4బీ నైట్ వాచ్'?:
ఈ-4బీ అనేది సంక్షోభాల సమయంలో అమెరికా అధ్యక్షుడు, రక్షణ మంత్రి, కార్యదర్శి, సీనియర్ సైనిక నాయకులు ఉపయోగించుకునేలా రూపొందించబడిన వైమానిక కమాండ్ పోస్ట్. దీనిని "ఫ్లయింగ్ పెంటగాన్" అని కూడా పిలుస్తారు. ఈ విమానం అణు పేలుళ్లును కూడా తట్టుకోగలదు.. స్పాట్ లో ప్రతీకార దాడులను చేయగలదు.
ఇది ప్రపంచ కమ్యూనికేషన్ కోసం 67 ఉపగ్రహ డిష్ లు, యాంటెన్నాలను కలిగి ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను 'నైట్ వాచ్' పేరిట పిలుస్తారు. అమెరికా వాయుసేన నియంత్రణలో ఇది ఉంటుంది. అమెరికా అమ్ములపొదిలో ఇలాంటివి నాలుగు విమానాలున్నాయి. ఇందులో సిబ్బందితో సహా కలిసి 112 మంది వరకు ప్రయాణించవచ్చు.
ఇది ఏకధాటిగా 12 గంటలపాటు గాల్లో ఉండి.. 7,000 మైళ్లు ప్రయాణించగలదు. ఇక రీఫ్యూయలింగ్ చేసుకొని ఇప్పటి వరకు అత్యధికంగా 35.4 గంటలు గాల్లో ఉన్న చరిత్ర దీనికి ఉంది. కొన్నాళ్ల క్రితం ఈ విమానాలను కొత్త వాటితో భర్తీ చేయడానికి సియర్రా నెవాడ కార్పొరేషన్ కు 13 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఇచ్చారు.
'నైట్ వాచ్'లోని మూడు అంతస్తుల్లో మొత్తం 18 బంకులు, బ్రీఫింగ్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, కమాండ్ రూమ్, టీమ్ వర్క్ ఏరియా, ప్రత్యేకమైన విశ్రాంతి ప్రదేశాలు ఉన్నాయి. దీనిని గతంలో గతంలో జార్జి డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాటి రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్ ఫెల్డ్ ఎక్కువగా దీనిని వాడేవారని చెబుతారు.
ఇరాన్ పై దాడికి ట్రంప్ ఫిక్సయ్యారా..?:
గత రెండు రోజులుగా... ఇజ్రాయెల్ కు అండగా అమెరికా యుద్ధరంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ బలంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... యుద్ధానికైనా, శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉందంటూ ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హేగ్సెత్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల కోసం తాము ఎదురుచూస్తున్నామని.. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు వాటిని అమలు చేస్తామనిని ప్రకటించారు.
మరోవైపు వైట్ హౌస్ లోని ప్రెస్ మీట్ లో... 'యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా?' అన్న ప్రశ్నకు స్పందించిన ట్రంప్... 'జోక్యం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు.. నేనేం చేయాలనుకుంటున్నానో ఎవరికీ తెలియదు.. కాకపోతే ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పగలను.. వారు ఇప్పుడు చర్చించాలని అనుకుంటున్నారు.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది.. ఈ పని వారు రెండువారాల క్రితమే చేయాల్సింది' అని అన్నారు.
ఈ నేపథ్యంలో... అమెరికా నేరుగా రంగంలోకి దిగుతున్నట్లుందనే చర్చకు బలం చేకూరినట్లయ్యింది! పైగా... ట్రంప్ స్టేట్ మెంట్స్ నేపథ్యంలో ఈ వారాంతంలో కానీ, వచ్చే వారం మొదట్లో కానీ.. ఇరాన్ పై అమెరికా దాడులు చేయోచ్చనే చర్చ నెట్టింట విపరీతంగా జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో... "ఫ్లయింగ్ పెంటగాన్" సడన్ గా వాషింగ్టన్ కు రావడం ఈ ఊహాగాణాలకు బలం చేకూర్చింది!
