Begin typing your search above and press return to search.

అమెరికా డాలర్ కు చెక్.. ప్రత్యామ్మాయం వస్తోంది..

GTRI ప్రకారం.. రష్యా-చైనా మధ్య వాణిజ్యంలో 90 శాతం లావాదేవీలు రూబుల్ లేదా యువాన్‌లలో జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 10:00 PM IST
అమెరికా డాలర్ కు చెక్.. ప్రత్యామ్మాయం వస్తోంది..
X

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తామే అగ్రనాయకులం అంటూ విధించిన ఆంక్షలే ఇప్పుడు అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ పరిస్థితిని సృష్టిస్తున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) స్పష్టం చేసింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు వాటిని డాలర్‌ను విడిచిపెట్టి, స్థానిక కరెన్సీల్లో వాణిజ్యానికి దారితీస్తున్నాయని తెలిపింది.

- SWIFT నిషేధం: డాలర్ బహిష్కరణకు తొలి అడుగు

SWIFT వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని సుమారు 11,000 బ్యాంకులను అనుసంధానించే అంతర్జాతీయ చెల్లింపు వేదిక. అయితే అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా, ఇరాన్, వెనుజువెలా వంటి దేశాలకు SWIFT సేవలు నిలిపివేయడం వలన, వాటి మీద ఆధారపడే దేశాలు డాలర్ కాకుండా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను అన్వేషించాయి. తద్వారా భారతదేశం, చైనా వంటి దేశాలు వారి స్వంత కరెన్సీల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.

- రూబుల్, యువాన్, రూపాయి: పెట్రో డాలర్‌కు ప్రత్యామ్నాయాలు

GTRI ప్రకారం.. రష్యా-చైనా మధ్య వాణిజ్యంలో 90 శాతం లావాదేవీలు రూబుల్ లేదా యువాన్‌లలో జరుగుతున్నాయి. భారత్ కూడా రష్యా నుండి చమురు కొనుగోళ్లకు రూపాయి లేదా యూఏఈ దిర్హామ్‌లలో చెల్లింపులు చేస్తోంది. డాలర్ ఆధిపత్యం పట్ల గల నిరసనగా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు దేశాలు అడుగులు వేయడాన్ని రక్షణాత్మక చర్యగా చూడాలని GTRI అంటోంది.

- ట్రంప్ ప్రతిపాదనలపై విమర్శలు

డాలరేతర కరెన్సీల్లో ట్రేడింగ్ చేస్తున్న బ్రిక్స్ దేశాలపై 10 శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా GTRI తీవ్ర విమర్శలు చేసింది. రష్యా నుండి చమురు కొనుగోళ్లపై 500 శాతం టారిఫ్‌లు వంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని పేర్కొంది.

- భారతీయ రూపాయి సెటిల్‌మెంట్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

డాలర్ల కొరతతో బాధపడుతున్న దేశాలతో రూపాయిల్లో ట్రేడింగ్ చేసుకోవడానికి 2022లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. ఈ చర్యలతో రష్యా బ్యాంకులు భారతీయ రూపాయి అకౌంట్లు తెరిచాయి. అంతేకాదు, డబుల్ డాలర్ కన్వెర్షన్ ఖర్చు (సుమారు 4%) నుంచి తప్పించుకోవడానికి స్థానిక కరెన్సీ ట్రేడింగ్ ఉత్తమ మార్గమని నివేదిక పేర్కొంది.

- బ్రిక్స్ కామన్ కరెన్సీ ప్రతిపాదనకు వ్యతిరేకత

బ్రిక్స్ దేశాల మధ్య కామన్ కరెన్సీ ఏర్పాటు చేసే అంశం చర్చకు వచ్చినప్పటికీ, భారత్, చైనా ఈ ప్రతిపాదనకు మొగ్గు చూపకుండా స్థానిక కరెన్సీల్లో ట్రేడింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు GTRI నివేదిక వెల్లడించింది. ఈ విధంగా అమెరికా విధించిన ఆంక్షలే దేశాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నాయని స్పష్టమవుతోంది.

ప్రపంచం నెమ్మదిగా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తిరస్కరించే దిశగా కదులుతోందని GTRI స్పష్టం చేసింది. ఇది తిరుగుబాటు కాదని, అవసరమే అనే దిశగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తు ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాల్లో నిర్మితమవుతోంది.