అమెరికాకు షాక్.. టీఆర్ఎఫ్ పై ఈగ వాలితే పాక్ ఊరుకుంటుందా?
అవును... పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'(టీఆర్ఎఫ్) విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 July 2025 11:11 AM ISTతాము ఉగ్రవాద బాధితులమే అని చెప్పుకుంటూ, ఉగ్రవాదుల నెట్ వర్క్ ను తాము నాశనం చేశామని ప్రకటించుకుంటూ.. ధ్వంసమైన ఉగ్రవాదులకు పునర్ణిర్మాణాలు చేసి పెట్టడం, వారి మనుగడకు ఆర్థిక సహకారం అందించడం పాకిస్థాన్ పని అనే సంగతి దాదాపు అందరికీ తెలిసిందే! కాకపోతే ఇంకా కూడా ప్రపంచం ముందు పాక్ బొంకుతుంటుంది! ఈ క్రమంలో తాజాగా టీఆర్ఎఫ్ పై అమెరికా ఉగ్ర ముద్ర వేయడంపై ఘాటుగా స్పందించింది.
అవును... పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'(టీఆర్ఎఫ్) విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో... టీఆర్‌ఎఫ్ అనేది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని పేర్కొన్నారు.
ఈ పరిణామాలను భారత్ స్వాగతించింది. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదని తెలిపింది. ఈ సమయంలో పాకిస్థాన్ రంగంలోకి దిగింది. టీఆర్ఎఫ్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది.
ఇందులో భాగంగా... పహల్గాం దాడికి, లష్కరే తయిబా కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సదరు ఉగ్రసంస్థ నెట్ వర్క్ ను తాము ఇప్పటికే ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడిని లష్కరే తోయిబా కి అనుసంధానించే ఏ ప్రయత్నమైనా వాస్తవ విరుద్ధమని తెలిపింది. అక్కడితో ఆగని పాక్... తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము ముందుండి పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా... పాకిస్థాన్ చాలా సమర్థమంతంగా ఉగ్రవాద సంస్థల నెట్ వర్క్ ను ధ్వంసం చేసిందని.. ఉగ్రసంస్థల నాయకత్వాన్ని అరెస్టు చేయడంతో పాటు వారిని విచారించిందని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో... పహల్గాం దాడికి సంబంధించి దర్యాప్తు నేటికీ అసంపూర్తిగానే ఉందని తెలిపింది.
ఈ చర్యతో పాక్ ను ప్రపంచం ముందు అవమానపరచడమేనని పేర్కొంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న పాక్ ఖండిస్తుందని.. దానిని ఏ మాత్రం సహించదని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి సహకరించడానికి, ప్రపంచ శాంతి నెలకొల్పడానికి తమ విధానాలు మూలస్తంభంగా ఉంటాయని తెలిపింది. పహల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్ర ఏమాత్రం లేదని నొక్కి చెప్పింది!
అనంతరం భారత్ పై పడింది పాక్. ఇందులో భాగంగా.. జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల దురాగతాల నుంచి దారి మళ్లించడానికి, పాక్ వ్యతిరేక ప్రొపగండాను అవలంభించడంలో భారత్ కు ట్రాక్ రికార్డు ఉందని ఎద్దేవా చేసింది. ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ సమాజం నిష్పాక్షిక విధానాలను అవలంభించాలని డిమాండ్ చేసింది.
కాగా... జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'(టీఆర్ఎఫ్) తొలుత బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం.. దీంతో ఇరు దేశాల తీవ్రమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోన్న నేపథ్యంలో ఆ ప్రకటనను విరమించుకుంది.
