Begin typing your search above and press return to search.

యుద్ధం మొదలుపెట్టించి దోచుకునే ప్లాన్..అమెరికా రక్షణ మంత్రి దొరికిపోయాడు

హెగ్సెత్‌తో సంబంధం ఉన్న ఒక బ్రోకర్ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మార్గాన్ స్టాన్లీ ప్రతినిధులతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

By:  A.N.Kumar   |   31 March 2026 4:41 PM IST
యుద్ధం మొదలుపెట్టించి దోచుకునే ప్లాన్..అమెరికా రక్షణ మంత్రి దొరికిపోయాడు
X

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ అమెరికా రక్షణ శాఖలో చోటుచేసుకున్న ఒక అంతర్గత వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు సన్నిహితంగా ఉన్న ఒక బ్రోకర్.. యుద్ధానికి కొద్ది వారాల ముందే రక్షణ రంగ కంపెనీల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రయత్నించినట్లు వెలువడిన వార్తలు అగ్రరాజ్య రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

ఏమిటీ వివాదం? ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఫైనాన్షియల్ టైమ్స్' ప్రచురించిన కథనం ప్రకారం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలు ప్రారంభం కావడానికి సరిగ్గా కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. హెగ్సెత్‌తో సంబంధం ఉన్న ఒక బ్రోకర్ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మార్గాన్ స్టాన్లీ ప్రతినిధులతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ అయిన బ్లాక్‌రాక్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ భేటీలో బ్లాక్‌రాక్ నిర్వహిస్తున్న 'డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీఎఫ్' (ఈటీఎఫ్)లలో మిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఆ బ్రోకర్ ఆసక్తి చూపినట్లు సమాచారం. రక్షణ రంగ షేర్లలో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని చూడటం అది కూడా యుద్ధానికి సరిగ్గా ముందే జరగడం వెనుక ఏదైనా 'ముందస్తు సమాచారం' ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

రక్షణ రంగ దిగ్గజ కంపెనీలే టార్గెట్

బ్లాక్‌రాక్ నడుపుతున్న ఈ డిఫెన్స్ ఫండ్ విలువ సుమారు 3.2 బిలియన్ డాలర్లు. ఇందులో ప్రధానంగా అమెరికా రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే లాక్‌హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్ , నార్త్‌రోప్ గ్రుమ్మన్ వంటి దిగ్గజ కంపెనీల వాటాలు ఉంటాయి. యుద్ధం సంభవించినప్పుడు లేదా దేశాల రక్షణ బడ్జెట్లు పెరిగినప్పుడు ఈ కంపెనీల షేర్ల విలువ విపరీతంగా పెరుగుతుంది. తద్వారా పెట్టుబడిదారులకు భారీ లాభాలు చేకూరుతాయి.

అయితే సాంకేతిక కారణాల వల్ల మార్గాన్ స్టాన్లీ ద్వారా ఆ సమయంలో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదని సమాచారం. కానీ ఆ తర్వాత సదరు వర్గాలు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టాయా అనే కోణంలో విచారణ జరగాల్సి ఉంది.

నైతికతపై ప్రశ్నలు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

ఈ వ్యవహారం ఇంతటి వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలే. పశ్చిమాసియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, యుద్ధ నిర్ణయాల విషయంలో పీట్ హెగ్సెత్ సలహా అత్యంత కీలకమైనదని.. ఆయన చెప్పడం వల్లే ఇరాన్ పై యుద్ధానికి దిగినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అంటే యుద్ధం ఎప్పుడు జరగబోతోంది.. అమెరికా వ్యూహం ఏమిటి అనే అత్యంత రహస్య సమాచారం హెగ్సెత్‌కు ముందే తెలుసు.

ఈ నేపథ్యంలో అధికారిక రహస్యాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక లాభాల కోసం ప్రయత్నించడం ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ పరిధిలోకి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు దేశాల మధ్య శాంతిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన ఉన్నత పదవిలో ఉండి మరోవైపు యుద్ధం ద్వారా లాభపడే కంపెనీల్లో పెట్టుబడుల కోసం ప్రయత్నించడం నైతిక విలువలకు విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తేలాల్సిన నిజాలు

ప్రస్తుతానికి పీట్ హెగ్సెత్ గానీ, పెంటగాన్ గానీ ఈ ఆరోపణలను అధికారికంగా ఖండించలేదు. అయితే ప్రతిపక్షాలు,అంతర్జాతీయ పారదర్శకత సంస్థలు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో రక్షణ మంత్రి స్థాయి వ్యక్తి చుట్టూ ఇటువంటి ఆర్థిక వివాదం ముసురుకోవడం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసే అంశమే. యుద్ధం అనేది మానవ ప్రాణాలకు సంబంధించిన విషయమే కాదు.. దాని వెనుక కొన్ని శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయనే చేదు నిజాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.