Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ వీసాకు ట్రంప్ సర్కారు మిలియన్ డాలర్ల ఫీజుకు ఫెడరల్ కోర్టు నో

ట్రంప్ సర్కారు తీరుపై కోర్టును ఆశ్రయించిన వేళ.. తాజాగా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ట్రంప్ సర్కారు ఏకపక్షంగా పెంచిన హెచ్1బీ వీసా ఫీజు సరికాదని స్పష్టం చేసింది.

By:  Garuda Media   |   9 Jun 2026 9:56 AM IST
హెచ్ 1బీ వీసాకు ట్రంప్ సర్కారు మిలియన్ డాలర్ల ఫీజుకు ఫెడరల్ కోర్టు నో
X

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ.. ట్రంప్ సర్కారు వేస్తున్న వీరంగం.. అర్థం పర్థం లేని విధానాలు.. విదేశీయులకు చెక్ చెప్పేలా తీసుకుంటున్న నిర్ణయాలకు పలు దేశాలతో పాటు.. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న పేరును ఎంజాయ్ చేయటమే కాదు.. ఆ బాధ్యతను మోసే విషయంలో ట్రంప్ తీరు మిగిలిన అధినేతలకు భిన్నంగా ఉండటం తెలిసిందే. హెచ్1బీ వీసా జారీ ఫీజును భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మిలియన్ డాలర్ల (నిర్ణయం తీసుకున్న సమయంలో మన రూపాయిల్లో చెబితు రూ.84 లక్షలు.. ఇప్పుడైతే రూ.93 లక్షల వరకు ఉంటుంది)కు పెంచేయటం తెలిసిందే.

ట్రంప్ సర్కారు తీరుపై కోర్టును ఆశ్రయించిన వేళ.. తాజాగా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ట్రంప్ సర్కారు ఏకపక్షంగా పెంచిన హెచ్1బీ వీసా ఫీజు సరికాదని స్పష్టం చేసింది. విదేశీయులు తక్కువ జీతాలకే అమెరికాకు వచ్చి స్థానిక అమెరికన్ల జాబ్ లను కొల్లగొడుతున్నట్లుగా ట్రంప్ చేస్తున్న వాదనతో పాటు.. అలాంటి పరిస్థితిని అడ్డుకునేందుకు భారీగా హెచ్1బీ వీసా ఫీజును ఏకపక్షంగా పెంచేసిన వైనాన్ని ఫెడరల్ కోర్టు అంగీకరించలేదు. ఈ భారీ ఫీజు చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఆ ఉత్తర్వు అమలును కొట్టివేసింది.

బోస్టన్ కు చెందిన అమెరికా డిస్ట్రిక్టు జడ్జి లియో సోరోకిన్ తీర్పును ఇస్తూ.. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ఆమోదం లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా ఇంత భారీగా ఫీజులను పన్నుల రూపంలో విధించలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలకు.. ఐటీ నిపుణులకు పెద్ద ఉపశమనంగా చెప్పాలి. ఈ మొత్తం వివాదం 2025 సెప్టెంబరులో షురూ అయ్యింది. అమెరికా అధ్యక్షుడిగా తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని కొత్తగా దరఖాస్తు చేసే హెచ్1 బీ వీసా అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్ల అదనపు రుసుమును విధిస్తూ ఆర్డర్ జారీ చేయటం తెలిసిందే.

దీనికి విదేశీ శ్రామిక శక్తిపై ఆధారపడటాన్ని తగ్గించటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వును అమెరికాలోని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు.. పలు ఐటీ అసోసియేషన్లు.. 20 వరకు డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిర్ణయం ఫెడరల్ ఆడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్టు తో పాటు అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా వారు వాదనలు వినిపించారు.

డిసెంబరు 2025లో ఈ కేసుకు సంబంధించి ఒక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి.. వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను రిజెక్టు చేశారు. ఇమ్మిగ్రేషన్ విధానాల్ని నియంత్రించే విస్త్రత అధికారులు అధ్యక్షుల వారికి ఉన్నట్లుగా చెబుతూ.. ఆయన విధించిన లక్షడాలర్ల ఫీజును సమర్థించారు. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలు హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాయి. తాజాగా (జూన్8, 2026) రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన మరో కేసును విచారించిన బోస్టన్ కోర్టు జడ్జి లియో సోరోకిన్.. ఇంతకు ముందు ఇచ్చిన తీర్పును విబేధించారు.

సరికొత్త తీర్పును ఇస్తూ.. లక్ష డాలర్లు అనేది రుసుము సాధారణ సర్వీసు ఫీజుకాదని.. ఇదో అక్రమ పన్నుగా అభివర్ణించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ తరహా పన్ను విధించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. అధ్యక్షుల వారికి ఉన్న విశేష అధికారాల్లో ఇది ఉండదని.. అందుకే పెంపు చట్టబద్ధం కాదని కొట్టేశారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇప్పుడేమవుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. ఈ తీర్పుపై ట్రంప్ సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాము చట్టపరిధిలోనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెబుతూ.. ఉన్నత న్యాయస్థానానికి ఈ కేసు అప్పీలుకు వెళ్లనున్నట్లుగా వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం వద్దకు చేరినట్లైంది. అక్కడి తీర్పుకు అనుగుణంగా పరిణామాలు ఉంటాయని చెప్పొచ్చు.