ట్రంప్ కు షాకిచ్చిన కోర్టు.. టారిఫ్ లకు బ్రేకు..మధ్యలో భారత్-పాక్ లొల్లి
‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానం ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 29 May 2025 12:25 PM IST‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానం ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్‌లు అమలుకాకుండా యూఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విచారణ సందర్భంగా ‘భారత్-పాక్ ఉద్రిక్తతల’ అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్-పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు.
సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.
‘‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి కాంగ్రెస్ అపరిమిత అధికారాలను అప్పగించలేదు. ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించేందుకు కాంగ్రెస్‌కు రాజ్యాంగం ప్రత్యేక అధికారాన్ని కల్పించింది. దీన్ని అధ్యక్షుడి అత్యవసర అధికారాలతో అధిగమించలేరు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది’’ అని కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై వెంటనే ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది.
కోర్టు తీర్పుతో ఇప్పుడు వైట్‌హౌస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై స్పష్టత లేదు. ఎమర్జెన్సీ పవర్ టారిఫ్‌ను నిలిపివేయనుందా? లేదా కొత్త సుంకాలు విధిస్తారా అన్నది తెలియరాలేదు. ఈ సుంకాలను ఆపితే.. ట్రంప్‌నకు ఉన్న అధికారాల ప్రకారం ద్రవ్యలోటు ఉన్న దేశాలతో తాత్కాలికంగా 150 రోజుల వరకు 15శాతం దిగుమతి పన్ను విధించే అవకాశాలున్నాయి.
