ఆఫీస్ లీజింగ్ : ఇండియాలో అమెరికా కంపెనీలో రికార్డ్
అమెరికన్ మూలాలైన GCCలు, అమెరికా సంస్థల మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో మూడింట రెండు వంతులకుపైగా వాటాను కలిగి ఉన్నాయి.
By: Tupaki Desk | 14 Jun 2025 11:00 PM ISTభారతదేశ ఆఫీసు మార్కెట్‌లో అమెరికా కంపెనీలు చారిత్రాత్మక రికార్డులను సృష్టించాయి. ముఖ్యంగా 2024లో లీజింగ్ కార్యకలాపాల్లో అమెరికన్ సంస్థలు అగ్రస్థానాన్ని నమోదు చేశాయి. ఈ అద్భుతమైన వృద్ధికి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) ప్రధానంగా దోహదపడుతున్నాయని జెఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది.
లీజింగ్‌లో అగ్రస్థానం: గణాంకాలు ఏం చెబుతున్నాయి?
2017 నుంచి 2025 మొదటి త్రైమాసికం (Q1) వరకు లీజింగ్ డేటాను విశ్లేషించినప్పుడు 2022 క్వార్టర్ 2025 మధ్య కాలంలో భారత ఆఫీసు మార్కెట్‌లో అమెరికా కంపెనీల వాటా 34.2 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2024లో అత్యధిక వార్షిక లీజింగ్ నమోదైంది. అంతేకాదు 2025 తొలి త్రైమాసికంలో కూడా లీజింగ్ కార్యకలాపాలు గత ఏడాది త్రైమాసిక సగటుతో సమానంగా కొనసాగాయి.
కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే అమెరికా కంపెనీల వాటా కొద్దిగా తగ్గినప్పటికీ, వారి మొత్తం లీజింగ్ వాల్యూమ్ మాత్రం సుమారు 16 శాతం పెరిగింది. ఇది భారతదేశాన్ని అమెరికా సంస్థలు ఒక వ్యూహాత్మక కేంద్రంగా మలుచుకుంటున్నాయనడానికి స్పష్టమైన సంకేతం.
- GCCల కీలక పాత్ర
"అమెరికన్ మూలాలైన GCCలు, అమెరికా సంస్థల మొత్తం లీజింగ్ కార్యకలాపాల్లో మూడింట రెండు వంతులకుపైగా వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం ఇప్పటికీ అమెరికా కంపెనీల వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తోంది" అని జెఎల్‌ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ సమంతక్ దాస్ అభిప్రాయపడ్డారు.
- నగరాల వారీగా వృద్ధి
2022-క్వార్టర్ 2025 మధ్య కాలంలో అమెరికా సంస్థల లీజింగ్ కార్యకలాపాల్లో 35 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ తదుపరి అత్యుత్తమ గమ్యస్థానాలుగా నిలిచాయి. ఆ తర్వాత చెన్నై, పుణె స్థానాలను పదిలపరుచుకున్నాయి.
నివేదిక ప్రకారం.. ప్రతి నగరం ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తోంది
బెంగళూరు ఐటీ రంగానికి మించి బహుళ-రంగాల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తర్వాత చెన్నై BFSI (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), ఈ-కామర్స్, టెక్ రంగాలలో సమతుల్యమైన మార్కెట్‌ను కలిగి ఉంది. ముంబయి ఆర్థిక రాజధానిగా కొనసాగుతూ, BFSI GCCలకు ఆధిపత్య కేంద్రంగా ఉంది. హైదరాబాద్ BFSI, హెల్త్‌కేర్, ఫార్మా కార్యకలాపాలకు ప్రత్యేక కేంద్రంగా ఎదిగింది.
-పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రం
"భారతదేశంలోని నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల సమృద్ధి, అనుకూలమైన వాణిజ్య వాతావరణం, తక్కువ ఖర్చులు, వ్యాపారానికి అనువైన విధానాలు అమెరికా కంపెనీలను ఇక్కడ మరింత పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షిస్తున్నాయి" అని జెఎల్‌ఎల్ ఇండియా హెడ్-ఆఫీస్ లీజింగ్ & రిటైల్ సర్వీసెస్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అరోరా పేర్కొన్నారు.
ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో అమెరికా సంస్థల ఈ రికార్డు స్థాయి లీజింగ్ కార్యకలాపాలు దేశ ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది.
