చైనా ముందు మోకరిల్లిన అమెరికా.. పరువు పాయే
గొప్పలకు పోయి తిప్పలుపడడం అంటే ఇదేనేమో.. ఇన్నాళ్లు మాకు పోటీదారు అయినా చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఆంక్షలు విధించాడు.
By: Tupaki Desk | 2 May 2025 5:00 AM ISTగొప్పలకు పోయి తిప్పలుపడడం అంటే ఇదేనేమో.. ఇన్నాళ్లు మాకు పోటీదారు అయినా చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఆంక్షలు విధించాడు. ఆ దేశ వ్యాపారాన్ని దెబ్బతిస్తానన్నాడు. చైనా తగ్గకుండా తిరిగి ఆంక్షలు వేసింది. దీంతో కుదేలైంది అమెరికన్ మార్కెట్ నే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు అంటూ చైనా ముందు మోకరిల్లింది అమెరికా. టారీఫ్ లపై చర్చిద్దాం అంటూ సన్నాయి నొక్కులతో చైనా అధికారులను సంప్రదించింది. అగ్రరాజ్యం పరువు తీసుకుంది.
టారిఫ్‌లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారులు చైనా అధికారులను సంప్రదించినట్లు బీజింగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ప్రపంచ పంపిణీ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆ మీడియా పేర్కొంది. దీంతో చైనా దెబ్బకు అమెరికా దిగివచ్చిందని మీడియాలో వార్తలు , సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. అయితే, ఈ సంప్రదింపులు, వాటి ఆవశ్యకతపై రెండు దేశాల నుంచి వస్తున్న నివేదికలు భిన్నంగా ఉండటం గమనార్హం.
చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీ ప్రకారం, అమెరికా అధికారులు వివిధ మార్గాల్లో చైనీయులను సంప్రదించారు. చర్చల కోసం అమెరికానే ఆత్రుతతో ఎదురు చూస్తోందని, ట్రంప్ కార్యవర్గం తీవ్ర ఒత్తిడిలో ఉందని సీసీటీవీ తన కథనంలో పేర్కొంది. ఈ సంప్రదింపులు ఇరు దేశాలు గతంలో పరస్పరం సుంకాలు విధించుకున్న నేపథ్యంలో జరిగాయి.
అయితే, ఈ సంప్రదింపులపై చైనా విదేశాంగశాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అంతేకాకుండా, బీజింగ్ నుంచి వస్తున్న ఈ నివేదిక.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా ఉంది. టారిఫ్‌లపై చర్చల కోసం చైనానే తీవ్రంగా యత్నిస్తోందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నాయని, అయితే చర్చల్లో అమెరికా నిబంధనలకు లోబడే ఒప్పందం జరుగుతుందని ఆయన ఇటీవల స్పష్టం చేశారు.
దాదాపు వారం రోజుల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అప్పట్లోనూ ట్రంప్ ఇదే తరహా ప్రకటన చేయగా చైనా బహిరంగానే ఖండించింది. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు ఏమీ జరగడంలేదని అప్పట్లో చైనా ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో ఈ అంశంపై చర్చలకు సిద్ధమే అని ఆయన అప్పట్లో చెప్పడం విశేషం.
బీజింగ్, వాషింగ్టన్‌ల నుంచి వస్తున్న భిన్నమైన కథనాలు, ప్రస్తుతం చర్చలు జరగడంలేదని చైనా ఖండించినప్పటికీ భవిష్యత్తుకు తలుపులు తెరిచి ఉంచడం.. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల్లో ఉన్న సంక్లిష్టతను, అస్పష్టతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. టారిఫ్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
