అమెరికాకు షాక్ ఇచ్చిన చైనా.. సుంకాలు 125 శాతానికి పెంపు
ఈ పరిణామాలపై స్పందించిన చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇది కేవలం ఒక "నంబర్ గేమ్" అని అభివర్ణించింది.
By: Tupaki Desk | 11 April 2025 4:16 PM ISTఅమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై సుంకాలను 145 శాతానికి పెంచడంతో, బీజింగ్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ చైనా తాజాగా ప్రకటించింది. ఈ చర్యలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పరిణామాలపై స్పందించిన చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇది కేవలం ఒక "నంబర్ గేమ్" అని అభివర్ణించింది. తక్షణ ఆర్థిక ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. పరస్పరం విధించుకున్న సుంకాలను తొలగించాలని అమెరికాను కోరింది. అంతేకాకుండా అమెరికా వేసే టారిఫ్‌లను ఇకపై పట్టించుకోబోమని స్పష్టం చేసింది. వాషింగ్టన్ సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సవాలు చేయనున్నట్లు చైనా మీడియా పేర్కొంది.
మరోవైపు, అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, సుంకల విషయంలో అమెరికాతో తీవ్రంగా తలపడుతున్న చైనా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అయితే, బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. అమెరికా సుంకల యుద్ధమే చేయాలనుకుంటే, చివరి వరకు పోరాడతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్‌కియాన్ స్పష్టం చేశారు. "చైనాతో డీల్ చేసుకోవడానికి ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు సరైన మార్గం కాదు. రెండు దేశాలు కలిసి కూర్చుని విభేదాలను పరిష్కరించుకోవాలి. పరస్పర గౌరవం అనే సూత్రాల ఆధారంగా చర్చలు జరగాలని మేము ఆశిస్తున్నాము" అని ఆయన అన్నారు.
ట్రంప్ టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ఆయన ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించారు. ఈ బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐరోపా యూనియన్ తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలని, అప్పుడే తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోగలరని ఆయన అన్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కూడా పరిరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మొత్తానికి అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
