Begin typing your search above and press return to search.

ఒకటికి రెండు ఇచ్చేలా అమెరికాకు చైనా ఆన్సర్

దీనికి ప్రతీకారంగా అమెరికా మీద 34 శాతం సుంకాల్ని చైనా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంలా మారారు.

By:  Tupaki Desk   |   10 April 2025 10:02 AM IST
Trump Vs China Tariff War
X

ఇద్దరు మొండోళ్ల మధ్య పోరు మొదలైతే ఎలా ఉంటుంది? అదేదో వ్యక్తుల మధ్య అయితే అదో లెక్క. అందుకు భిన్నంగా రెండు మొండి దేశాల మధ్య మొదలైన వాణిజ్య జగడం ఇప్పుడు అనూహ్య పరిణామాలను తెర మీదకు తీసుకొస్తోంది. ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాల్ని వేస్తామని ట్రంప్ ప్రకటించటం.. ఆ వెంటనే ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వేళ.. చైనా మాత్రం అందుకు భిన్నంగా తగ్గేదేలే.. అన్నట్లుగా రియాక్టు అవుతోంది.

తన నిర్ణయానికి ప్రపంచ దేశాలన్ని దెబ్బకు లైన్లోకి వచ్చిన వేళ.. అందుకు భిన్నంగా చైనా మాత్రం సై అంటే డబుల్ సై అన్న రీతిలో రియాక్టు అవుతున్న వైనం ఇప్పుడు అందరి చూపు ఈ రెండు దేశాల మీద పడేలా చేసింది. తొలుత చైనా మీద 20 శాతం సుంకాల్ని ట్రంప్ విధించారు.ఆ తర్వాత దానిని 34 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా మీద సుంకం 54 శాతానికి పెరిగినట్లైంది.

దీనికి ప్రతీకారంగా అమెరికా మీద 34 శాతం సుంకాల్ని చైనా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంలా మారారు. చైనా తగ్గకపోతే విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అయినా.. అందుకే పెద్దగా రియాక్టు కాని చైనా మీద అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.అయినా.. చైనా పట్టించుకోలేదు దీంతో బుధవారం మరో యాభై శాతం కలిపి మొత్తం సుంకాల్ని 104 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్రంగా రియాక్టు అయ్యింది. తాము తక్కువ తినలేదన్నట్లుగా అమెరికా పై 50 శాతం ప్రతీకార సుంకాల్ని బాదేసింది. దీంతో గతంలో ఆ దేశం విధించిన 34 శాతానికి 50 శాతం అదనంగా చేరటంతో మొత్తం 84 శాతం సుంకం విధించినట్లైంది. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన ట్రంప్.. చైనాపై 125 శాతం సుంకాన్ని పెంచేస్తూ బుధవారం సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించింది. తమ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా స్పందిస్తూ.. ప్రపంచ వాణిజ్య సంస్థలో తాము కేసు వేయనున్నట్లుగా ప్రకటించింది. మిగిలిన దేశాలకు భిన్నంగా ట్రంప్ తీరుపై పోరాడుతున్న చైనా తీరు ఇప్పుడు ఆకర్షిస్తోంది.

ట్రంప్ ప్రకటించిన 125 శాతం సుంకం షాక్ నేపథ్యంలో స్పందించిన చైనా.. ఆ నిర్ణయాలు తమనేమీ చేయలేవన్నట్లుగా ఉండటం గమనార్హం. అమెరికా సుంకాలపై చైనా ప్రధాని లీ కియాంగ్ రియాక్టు అయ్యారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని.. తగిన విధంగా బదులు ఇచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్ మయిల్ కు పాల్పడుతోందని.. దీనిపై తాము చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

ఎలాంటి అనిశ్చితులైనా తట్టుకునేలా తమ ఆర్థిక విధానాల్ని రూపొందించామన్న ఆయన.. ‘‘వాణిజ్య భాగస్వాములందరి పైనా ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్ష ధోరణికి నిదర్శనం. ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. మేం దీనికి ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాలు మాత్రమే కాదు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు కాపాడేందుకు పోరు చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

అంతేకాదు.. సుంకాలపై చర్చలకు తమకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చేసిన చైనా.. ఒకవేళ అమెరికా తమతో చర్చల కోసం ముందుకు వస్తే.. సమానత్వ ప్రాతిపదికన అప్పుడు ఆలోచిస్తామంటూ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ కానీ తెలిస్తే మరో పాతిక శాతం సుంకాన్ని చైనా మీద వేసినా ఆశ్చర్యం లేదేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిగిలిన దేశాల మాదిరి కాకుండా ట్రంప్ మొండికి తీసిపోనట్లుగా తాను జగమొండి అన్నవిషయాన్ని చైనా తాజా ఎపిసోడ్ లో స్పష్టం చేసిందని చెప్పాలి.