Begin typing your search above and press return to search.

వారసత్వానికి చెక్.. సొంత కుమారుడికే ఉద్యోగం ఇవ్వని అమెరికా బిలియనీర్!

"నేను రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించాను కాబట్టి, నా పిల్లలకు ఆసక్తి లేకపోయినా అదే రంగంలోకి రావాలని నేను కోరుకోను.

By:  Tupaki Desk   |   3 April 2025 3:00 AM IST
వారసత్వానికి చెక్.. సొంత కుమారుడికే ఉద్యోగం ఇవ్వని అమెరికా బిలియనీర్!
X

US Billionaire: తరాలు మారుతున్నా కొన్ని వ్యాపార సంస్థల్లో వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. తండ్రి తర్వాత కుమారుడు లేదా కుటుంబ సభ్యులే ఉన్నత స్థానాలను అధిరోహిస్తుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. తన కుమారుడు అర్హత సాధించే వరకు సొంత సంస్థలో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించి మిగతా వాళ్లకు ఆదర్శంగా నిలిచారు. ఫ్లోరిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రిలేటెడ్ గ్రూప్ అధినేత జోర్గ్‌ పెరెజ్‌ తన 60 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కాలేజీ విద్య పూర్తి చేసుకున్న తర్వాత తన సంస్థలో చేరాలని ఆసక్తి చూపిన కుమారుడు జాన్ పాల్‌కు ఆయన నిరాకరించారు.

ఈ సందర్భంగా పెరెజ్‌ మాట్లాడుతూ.. "నా కుమారుడు నా దగ్గర పనిచేయడం కుదరదని స్పష్టం చేశాను. కేవలం నా వారసుడు అనే కారణంతో సంస్థ ప్రతిష్ఠను ప్రమాదంలో పడేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అతడు మొదట తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించాను. నా స్నేహితుడి సంస్థలో చేరి పనిచేయమని చెప్పాను. అంతేకాకుండా, మా సంస్థలో ఎప్పుడైనా పనిచేయాలనుకుంటే అత్యంత పోటీతత్వంతో కూడిన న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కనీసం ఐదేళ్ల పాటు పనిచేయాలని, అలాగే ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందాలని నా పిల్లలకు ముందే చెప్పాను" అని చెప్పుకొచ్చారు.

డబ్బు సంపాదించడానికి ఇష్టం లేని పని చేయకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. "నేను రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించాను కాబట్టి, నా పిల్లలకు ఆసక్తి లేకపోయినా అదే రంగంలోకి రావాలని నేను కోరుకోను. జీవితం నిత్యం సవాళ్లతో నిండి ఉంటుంది. ఇష్టం లేని పని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతేకాకుండా, కేవలం ఇంటిపేరు కారణంగానే నా సిబ్బంది నా పిల్లలకు పదవులు దక్కాయని భావించకూడదు" అని ఆయన అన్నారు.

పెరెజ్ సూచన మేరకు జాన్ పాల్ తొలుత బిలియనీర్ స్టీఫెన్ రాస్ సంస్థలో అనలిస్ట్‌గా చేరారు. ఆ తర్వాత నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2012 నాటికి రిలేటెడ్ గ్రూప్‌లో చేరడానికి తగిన ఎక్స్పీరియన్స్ సంపాదించినప్పటికీ, జాన్ పాల్‌కు వెంటనే ఉన్నత పదవి లభించలేదు. ఆయన మొదట సంస్థ రెంటల్ వ్యాపార బాధ్యతలు చూసుకున్నారు. తన అద్భుతమైన పనితీరుతో క్రమంగా ఎదుగుతూ సీఈఓ స్థానానికి చేరుకున్నారు. ఆయన సోదరుడు కూడా ఇదే మార్గాన్ని అనుసరించి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం జోర్గ్‌ పెరెజ్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

దాదాపు పదేళ్ల పాటు తన కుమారుల సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి ఆ కీలకమైన స్థానాలు అప్పగించామని పెరెజ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన వారసత్వంతో కాకుండా ప్రతిభతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపిస్తోంది.