అమెరికాలో నిరసనకారులపైకి దూకెళ్లిన కారు.. వీడియో వైరల్!
చికాగోలోని మన్రో స్ట్రీట్ లో నిరసనలు తెలుపుతున్న వారిపైకి ఓ ఎరుపురంగు కారు దూసుకెళ్లింది.
By: Tupaki Desk | 12 Jun 2025 9:40 PM ISTలాస్ ఏంజిల్స్ లో వలస వ్యతిరేక నిరసనలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఎత్తివేసిన కర్ఫ్యూను మళ్లీ విధించారు. మరోవైపు లాస్ ఏంజిల్స్ లో మొదలైన ఈ నిరసనలు దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ విస్తరించాయి! ఈ క్రమంలో తాజాగా షికాగోలో నిరసనలు తెలుపుతున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.
అవును... లాస్ ఏంజిల్స్ లో మొదలైన వలస వ్యతిరేక నిరసనలు ఆస్టిన్, డల్లాస్, చికాగో, టెక్సాస్, న్యూయార్క్, డెన్వర్ తో సహా అనేక ఇతర నగరాలకు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు షికాలో నిరసనలు తెలుపుతున్న వారిపైకి ఓ కారు దూసుకెళ్లగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
చికాగోలోని మన్రో స్ట్రీట్ లో నిరసనలు తెలుపుతున్న వారిపైకి ఓ ఎరుపురంగు కారు దూసుకెళ్లింది. దీంతో.. అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో 66 ఏళ్ల ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. అప్రమత్తమైన అధికారులు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి.
కాగా... లాస్ ఏంజిల్స్ లో కొనసాగుతున్న ఆందోళనలతో శనివారం నుంచి అధికారులు ఇప్పటివరకూ 400 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 330 మంది పత్రాలు లేని వలసదారులు కాగా.. వీరిలో 157 మంది దాడి, అడ్డగింపు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరు పోలీసు అధికారిపై హ్నత్యాయత్నం చేసేందుకు పాల్పడినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో నిరసనలను అణిచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం సుమారు 700 మంది మెరైన్లతో పాటు సుమారు 4,000 మంది సైనికులను మొహరించింది! ఈ సందర్భంగా... గందరగోళ తీవ్రతను తగ్గించడానికి డౌన్ టౌన్ ప్రాంతంలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
