Begin typing your search above and press return to search.

అమెరికా దాడులపై ఇరాన్ వైరల్ రియాక్షన్.. ఇజ్రాయెల్ లో హైఅలర్ట్!

అవును... తమ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ స్పందించింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 12:56 PM IST
అమెరికా దాడులపై ఇరాన్  వైరల్  రియాక్షన్..  ఇజ్రాయెల్  లో హైఅలర్ట్!
X

ఇజ్రాయెల్ - ఇరాన్ భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఇరాన్‌ లోని అత్యంత కీలక అణుకేంద్రాలైన ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్‌ లపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. దీనిపై ఇరాన్ స్పందించగా.. ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రెట్టింపు అయ్యాయని అంటున్నారు.

అవును... తమ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంపై ఇరాన్ స్పందించింది. ఇందులో భాగంగా.. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని హెచ్చరించింది. ఇదే సమయంలో... అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలోని యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది.

వాస్తవానికి ఇజ్రాయెల్‌ - ఇరాన్ యుద్ధంలో ఎంట్రీపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారని వైట్ హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే ట్రంప్‌ ఇరాన్‌ పై దాడులు చేశారు. ఈ సందర్భంగా... అమెరికా భారీ బంకర్ బ్లస్టర్ బాంబులు ఫోర్డోపై వేసిందని.. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు ట్రంప్.

దాడుల అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్... అమెరికాకు, తమ పౌరులకు నష్టం కలిగించేలా ఇరాన్‌ ఎటువంటి చర్యలు తీసుకున్నా అగ్రరాజ్యం తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. తన మాటలను పెడచెవిన పెట్టి.. టెహ్రాన్‌ ప్రతీకార చర్యలకు పాల్పడితే మాత్రం శనివారం రాత్రి టెహ్రాన్‌ పై చేసిన దాడుల కంటే తీవ్రంగా, గతంలో ఎన్నడూ చూడని విధంగా విరుచుకుపడతామని అన్నారు.

ఇజ్రాయెల్‌ లో హైఅలర్ట్:

ఇలా ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా... టెహ్రాన్‌ తమపై మరిన్ని దాడులు చేసే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది.

అమెరికాలోనూ హైఅలర్ట్!:

ఇరాన్‌ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు అమెరికా ముందుగానే జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా... వాషింగ్టన్‌ తో సహా పలు నగరాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.

ప్రధానంగా... ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్ పోలీసులు... ఇరాన్‌ లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి బెదిరింపులూ రాలేదని అన్నారు!