చైనా 'అణు' కుతంత్రం... గల్వాన్ ఘర్షణ కారణం!
క్రిస్టోఫర్ చెబుతున్న దాని ప్రకారం 2020 జూన్ 22న చైనాలోని లాప్ నూర్ భూగర్భంలో అణు పరిక్షలు జరిగాయి.
By: Ramesh Palla | 24 Feb 2026 3:46 PM ISTఅమెరికా, రష్యా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అణు ఒప్పందం ముగియడంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. రెండు దేశాల మధ్య మరోసారి ఒప్పందం కొనసాగింపు లేదా కొత్త ఒప్పందం కు సంబంధించిన చర్చలను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సమక్షంలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగశాఖ సెక్రటరీ క్రిస్టోఫర్ పాల్గొన్నారు. ఆ సమయంలో క్రిస్టోఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐక్యరాజ్య సమితి కళ్లు గప్పి చైనా చేసిన అణు పరీక్షల గురించి ఆయన ప్రస్తావించాడు. 2020 సంవత్సరంలో బీజింగ్ కేంద్రంగా అణు పరీక్షలు జరిగినట్లుగా ఆయన బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఇండియాతో చైనాకు విభేదాలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. దాంతో చైనా అణు పరీక్షలు నిర్వహించి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.
చైనా అణు పరీక్ష...
2020 లో భారత్, చైనా సరిహద్దు గల్వాన్ వద్ద ఘర్షణ జరిగిన విషయం తెల్సిందే. రెండు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందారు. ఆ సమయంలో భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించి చైనాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో చైనా ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దానికి సిద్ధం అయ్యిందనే వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో యుద్ధం ఆలోచన విరమించుకుందట. ఆ సమయంలోనే అణు పరీక్ష నిర్వహించి ఉంటుందని, యుద్ధం వస్తే ఇండియా పై అణుబాంబు దాడి చేయడం లేదా బెదిరించడం చేయవచ్చని చైనా భావించి ఉంటుందని అంతర్జాతీయ స్థాయి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టోఫర్ చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చైనా ఇలాంటి పని చేసే ఉంటుందని ఆ దేశం గురించి తెలిసిన వారు బల్ల గుద్ది మరి చెప్పడం విశేషం.
అమెరికా విదేశాంగశాఖ ...
క్రిస్టోఫర్ చెబుతున్న దాని ప్రకారం 2020 జూన్ 22న చైనాలోని లాప్ నూర్ భూగర్భంలో అణు పరిక్షలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రభావం కజికిస్తాన్ వరకు కనిపించిందని ఆయన అంటున్నాడు. కజికిస్తాన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చినట్లుగా పేర్కొన్నారు. మొదట భూకంపంగా భావించినప్పటికీ అది చివరకు అణు పరీక్షకు సంబంధించిన ప్రకంపనలు అని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను చైనా ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇతర దేశాల మాదిరిగా చైనా తమ దేశంలో జరుగుతున్న విషయాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు ఎప్పుడూ ముందుకు రావడం లేదని, దాంతో దాన్ని అణు పరీక్షగానే తాము భావిస్తున్నట్లుగా అంతర్జాతీయ వేదికపై క్రిస్టోఫర్ వ్యాక్యలు చేయడంతో చైనా పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
భారత్, చైనా మధ్య సంబంధాలు...
భారత్ పై కుట్ర చేసే ఉద్దేశంతో చైనా ఆ అణు పరీక్షలు చేసి ఉంటుందని వస్తున్న వార్తలపై చైనా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అణు పరీక్షల విషయంలో అమెరికా ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదు. అమెరికా తిరిగి అణు పరీక్షలు నిర్వహించాలి అనుకుంటుంది. అందుకోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని, చైనాను బూచిగా చూపించి అమెరికా అణు పరీక్షలు చేసే ప్రయత్నాలు చేస్తుందని చైనా విదేశాంగ శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ప్రస్తుతానికి భారత్, చైనా మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. కనుక చైనా అణు పరీక్షల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం. చైనా ఆర్థికంగా ప్రపంచంలోనే నెం.1 గా ఎదిగే క్రమంలో అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి అనుకుంటుంది. కనుక అణు పరీక్ష నిర్వహించి ఉంటుందని ఎక్కువ శాతం మంది నమ్ముతున్నారు.
