Begin typing your search above and press return to search.

రూ. 92 కోట్ల రివార్డు.. ఆచూకీ చెబితే అమెరికాలో సెటిల్మెంట్! ఎవరీ అదృశ్య నేత?

ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, మార్చి 12న ఆయన పేరుతో విడుదలైన మొదటి అధికారిక ప్రకటనను టీవీ యాంకర్ చదివి వినిపించారు తప్ప, ఆయన ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాలేదు.

By:  Tupaki Political Desk   |   14 March 2026 10:45 AM IST
రూ. 92 కోట్ల రివార్డు.. ఆచూకీ చెబితే అమెరికాలో సెటిల్మెంట్! ఎవరీ అదృశ్య నేత?
X

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28న జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టించింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే, ఆయన వారసుడిగా పగ్గాలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ ఇప్పుడు అమెరికా నిఘా వర్గాలకు మోస్ట్ వాంటెడ్ టార్గెట్ గా మారారు. విచిత్రం ఏమిటంటే, సుప్రీం లీడర్ గా ఎన్నికైనప్పటి నుంచి మొజ్తాబా ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారు? క్షేమంగా ఉన్నారా? లేక దాడుల్లో గాయపడ్డారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ చెప్పిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ. 92 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఎఫ్‌బీఐ కంటే వేగంగా రివార్డ్స్ ఫర్ జస్టిస్!

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' ప్రోగ్రామ్ ఈ సంచలన ప్రకటన చేసింది. కేవలం మొజ్తాబా మాత్రమే కాకుండా, ఇరాన్ భద్రతా వ్యవస్థలో కీలకమైన అలీ అస్గర్ హెజాజీ, అలీ లారిజాని వంటి పది మంది ప్రముఖులపై కూడా ఇలాంటి రివార్డులే ప్రకటించింది. వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఐఆర్‌జీసీ కార్యకలాపాలను వెనక ఉండి నడిపిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. సమాచారం అందించిన వారికి డబ్బు మాత్రమే కాకుండా, వారి ప్రాణాలకు రక్షణగా అమెరికాలో పునరావాసం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం.

మరణ వార్తల మధ్య మొదటి సందేశం!

మార్చి 9న సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28 దాడుల్లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని కొన్ని అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, మార్చి 12న ఆయన పేరుతో విడుదలైన మొదటి అధికారిక ప్రకటనను టీవీ యాంకర్ చదివి వినిపించారు తప్ప, ఆయన ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాలేదు. ఆ ప్రకటనలో ఆయన ‘హర్మూజ్ జలసంధిని మూసివేస్తాం, శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరించినట్లు సమాచారం. కానీ, ఫోటో లేదా వీడియో లేకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు మరింత పెరిగాయి.

'ఎపిక్ ఫ్యూరీ' - తాజా స్థితి!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' గా అభివర్ణిస్తున్నారు. ‘మేము ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక క్యాన్సర్ ను తొలగించాము’ అని ఖమేనీ మరణాన్ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. మొజ్తాబా ఖమేనీ నియామకాన్ని కూడా ఆయన ‘పెద్ద తప్పు’గా కొట్టిపారేశారు. ఇరాన్ ప్రభుత్వం త్వరలోనే లొంగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే మొజ్తాబా ఆచూకీ కోసం భారీ రివార్డు ప్రకటించడం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని మానసిక ఒత్తిడికి గురిచేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.

భద్రమైన సమాచార మార్పిడి

ఇరాన్ వంటి దేశాల్లో నిఘా నీడన సమాచారం ఇవ్వడం ప్రాణంతకం కాబట్టి, అమెరికా అత్యంత సురక్షితమైన మార్గాలను సూచించింది. ‘టోర్’ నెట్‌వర్క్ లేదా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా మాత్రమే తమను సంప్రదించాలని కోరింది. సమాచారం ఇచ్చే వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. యుద్ధం ముగుస్తున్న తరుణంలో ఇలాంటి సమాచారం ఇరాన్ ను పూర్తిగా లొంగదీసుకోవడానికి అమెరికాకు సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

రూ. 90 కోట్ల రివార్డు అంటే అది ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసే మొత్తం. ఇరాన్ లోని పరిస్థితుల వల్ల విసిగిపోయిన ఎవరైనా ఈ ఆఫర్ కు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అమెరికా ఆశిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే మొజ్తాబా సమాచారం బయటకు వస్తుందా? లేదా ఆయన అదృశ్యంగా ఉంటూనే యుద్ధాన్ని నడిపిస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా, హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు కష్టాలు పెరుగుతున్న వేళ, మొజ్తాబా ఆచూకీ దొరికితేనే ఈ యుద్ధానికి ఒక ముగింపు దొరికేలా కనిపిస్తోంది.