Begin typing your search above and press return to search.

సిటీలో ₹1.5 లక్షల జీతం.. సరిపోతుందా..? ఈ ఖర్చులను చూస్తే షాక్..

నెలకు లక్షన్నర జీతం అంటే ఒకప్పుడు కల. ఇప్పుడు అదే జీతం నగర జీవితంలో ఓ సాధారణ సంఖ్యలా మారిపోయింది.

By:  Tupaki Desk   |   16 Dec 2025 3:56 PM IST
సిటీలో ₹1.5 లక్షల జీతం.. సరిపోతుందా..? ఈ ఖర్చులను చూస్తే షాక్..
X

నెలకు లక్షన్నర జీతం అంటే ఒకప్పుడు కల. ఇప్పుడు అదే జీతం నగర జీవితంలో ఓ సాధారణ సంఖ్యలా మారిపోయింది. ‘₹1.5 లక్షలు వస్తే లైఫ్ సెట్’ అనుకునే భావన చాలా మందిలో ఇంకా ఉంది. కానీ సిటీలో అడుగు పెట్టిన తర్వాతే అసలు నిజం అర్థం అవుతుంది. జీతం పెద్దదిగా కనిపించినా, ఖర్చుల ముందు అది చిన్నదైపోతుంది. ఇదే నేటి అర్బన్ మిడిల్ క్లాస్ ఎదుర్కొంటున్న అసలు సవాల్. నగరాల్లో జీవితం ఇప్పుడు లగ్జరీ కాదు.. ఖరీదైన అవసరం. ఇంటి అద్దెతోనే మొదటి షాక్. మంచి ప్రాంతంలో 2BHK కావాలంటే కనీసం ₹35,000 నుంచి ₹50,000 వరకు వెచ్చించాల్సిందే. అదే సొంత ఇల్లు కొనాలంటే ఈఎంఐ (EMI)లు నెలకు ₹50,000 దాటుతున్నాయి. జీతంలో మూడో వంతు ఇంటికే పోతున్న పరిస్థితి. ‘ఇల్లు ఉంది’ అనేది స్టేటస్ కాదు, ఒక ఆర్థిక బాధ్యతగా మారిపోయింది.

గట్టిగానే ఖర్చులు..

ఇంటి తర్వాత వచ్చే ఖర్చులు ఇంకా గట్టిగానే ఉంటాయి. కరెంట్ బిల్, నీళ్ల బిల్, ఇంటర్నెట్, మొబైల్ రీచార్జ్ అన్నీ కలిపితే మరో ₹10,000. పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు, బస్ ఛార్జీలు, ట్యూషన్లు.. ఇవన్నీ కలిసి నెలకు ₹20,000–₹30,000 సులువుగా అవుతాయి. ఇక కిరాణా, కూరగాయలు, పాలు, గ్యాస్.. ఈ రోజుల్లో మార్కెట్‌కు వెళ్లడం కూడా భయంగా మారింది. నెలకు కనీసం ₹15,000–₹20,000 అక్కడే ఖర్చవుతోంది.

రవాణా ఖర్చులు మరో పెద్ద బురద. ఆఫీస్ దూరమైతే పెట్రోల్ లేదా క్యాబ్స్, మెట్రో పాసులు.. ఇవన్నీ కలిస్తే ₹8,000–₹12,000. ఇక హెల్త్ ఇన్సూరెన్స్, టెర్మ్ ఇన్సూరెన్స్ లాంటి అవసరమైన భద్రతా ఖర్చులు తప్పనిసరి. ఇవి లేకుండా జీవితం రిస్క్‌గా మారుతుంది. వాటికే నెలకు కొన్ని వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇంతటితో కథ అయిపోలేదు. సిటీ లైఫ్ అంటే సోషల్ లైఫ్. బయట తినడం, వీకెండ్ మూవీ, పిల్లల బర్త్‌డేలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, ఆన్‌లైన్ షాపింగ్.. ఇవన్నీ చిన్నచిన్న ఖర్చుల్లా కనిపించినా చివరికి పెద్ద మొత్తంగా మారతాయి. ‘మనమూ బతకాలి కదా’ అనే భావనతో ఇవి తప్పవు. కానీ నెలాఖరుకు వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే షాక్ తప్పదు.

ఇలా అన్ని ఖర్చులు తీసేస్తే ₹1.5 లక్షల జీతంలో నిజంగా చేతిలో మిగిలేది ఎంత? చాలా మందికి ₹20,000–₹30,000 కూడా మిగలడం లేదు. కొందరైతే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ మీదే జీవితం నడుపుతున్నారు. బయటకు చూస్తే మంచి జీతం, కానీ లోపల మాత్రం ఎప్పటికప్పుడు టెన్షన్, ఫైనాన్షియల్ ప్రెజర్. ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతుంది. నిజమైన సంపద అంటే ఏమిటి? పెద్ద జీతమా? కాదు. ఖర్చుల మీద నియంత్రణ, భవిష్యత్తుపై స్పష్టతే అసలైన సంపద. ₹1.5 లక్షలు సంపాదిస్తూ సేవింగ్స్ లేకపోతే, ₹60,000 సంపాదించి ప్లాన్ చేసుకున్నవాడే ధనవంతుడు. జీతం ఎంత వస్తోంది కంటే, ఎంత మిగులుతోంది అనేదే అసలు ప్రశ్న.

స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇక్కడ కీలకం. ఎస్ఐపీలు, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవి లగ్జరీలు కాదు, అవసరాలు. ఖర్చులను ట్రాక్ చేయడం, అవసరం లేని లైఫ్‌స్టైల్ షో ఆఫ్‌ను తగ్గించడం చాలా ముఖ్యం. ప్రతి ఖర్చు ‘నిజంగా అవసరమా?’ అని అడిగే అలవాటు ఉంటేనే ఫైనాన్షియల్ శాంతి దొరుకుతుంది.

చివరికి ఒక విషయం స్పష్టం.. సిటీ లైఫ్‌లో ₹1.5 లక్షల జీతం చాలునా అనే ప్రశ్నకు ఒకే జవాబు లేదు. మీరు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు. అన్నదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక నిజం మాత్రం మారదు.. జీతం గ్లామర్ కాదు, కంట్రోల్‌నే నిజమైన పవర్. ఇది ఇష్టమైన మాట కాదు, కానీ తప్పించుకోలేని రియాలిటీ.