Begin typing your search above and press return to search.

‘సివిల్స్’ ఎంత టఫ్? టాప్ 10 ర్యాంకర్ల మార్కులే నిదర్శనం..ఆశ్చర్యపోతారంతే!

తాజాగా ప్రకటించిన సివిల్స్ 2024లో టాప్ 10 ర్యాంకర్లకు వచ్చిన మార్కులు బయటకు వెల్లడయ్యాయి.

By:  Tupaki Desk   |   26 April 2025 10:30 AM
UPSC Top Rankers Marks
X

రెండు.. మూడు రోజుల క్రితం దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుకు సంబంధించిన ఈ పరీక్షను క్రాక్ చేయటం అంత మామూలు విషయం కాదు. ఏళ్లకు ఏళ్లు తపస్పు మాదిరి చేస్తుంటారు. అలాంటి పరీక్షను క్రాక్ చేయటమే కాదు.. అత్యుత్తమ ర్యాంక్ ను సాధించిన వారికి సంబంధించిన ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం.

తాజాగా ప్రకటించిన సివిల్స్ 2024లో టాప్ 10 ర్యాంకర్లకు వచ్చిన మార్కులు బయటకు వెల్లడయ్యాయి. ఈ వివరాల్ని చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా టాప్ ర్యాంకర్లు అంటే.. వందకు 90 ప్లస్ మార్కులు ఖాయంగా వస్తుంటాయి. అందరికి తెలిసిన పది.. ఇంటర్.. ఐఐటీ.. నీట్ లాంటి పరీక్షల్లో 90 ప్లస్ శాతం ఖాయంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే కొందరు వందకు వంద రావటం కనిపిస్తుంది.

అయితే.. దేశంలోనే అత్యంత క్లిష్టమైన.. కష్టమైన సివిల్స్ ఎగ్జామ్ లో ఈ ఏడాది టాపర్ గా నిలిచారు శక్తి దూబే. ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నో తెలుసా? ఆ విషయాన్ని తెలుసుకునే ముందు.. ఈ ఎగ్జామ్ కు ఎన్ని మార్కులకు ఉంటుంది? ఎగ్జామ్ ప్రాట్రన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మొత్తం మూడు దశల్లో ఈ పరీక్ష నడుస్తుంది. ప్రిలిమ్స్.. అందులో పాస్ అయితే మొయిన్స్.. దాన్ని అధిగమిస్తే ఇంటర్వ్యూ. ఆ తర్వాతే ర్యాంకు. ఇంత ప్రాసెస్ ఉండటం.. మార్కులు అంత ఆషామాషీగా రాకపోవటం లాంటివి మామూలే. ఈ మూడు అంచెల్లో సాగే ఈ పరీక్షకు మొత్తం మార్కులు 2025.. ఇందులో మొయిన్ రాతపరీక్షకు 1750 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి. 2024 సివిల్స్ లో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్న శక్తి దూబేకు వచ్చిన మారకులు అక్షరాల 1043 మాత్రమే. అంటే.. మొత్తం మార్కుల్లో 59.6 శాతం మార్కులే వచ్చాయి.

ఇక్కడ చెప్పేదేమంటే.. సివిల్స్ లో స్కోర్ చేయటం అంత తేలికైన విషయం కాదన్నది. శక్తిదూబేకు వచ్చిన 1043 మార్కుల్లో కూడా.. రాతపరీక్షలో 851 మార్కులు (1750 మార్కులకు 50 శాతం కంటే తక్కువ) ఇంటర్వ్యూలో 200 మార్కులు (275 మార్కులకు అంటే 72.7 శాతం) వచ్చాయి. టాపర్ కు వచ్చిన మార్కులే ఇలా ఉంటే.. మిగిలిన వారికి వచ్చే మార్కులు ఎలా ఉంటాయో అర్థమవుతుంది

రెండో ర్యాంకర్ హర్షిత గోయల్ 1038 మార్కులు రాగా.. మూడో ర్యాంకును సొంతం చేసుకున్న డోంగ్రే అర్చిత్ పరాగ్ కు సైతం రెండో ర్యాంకర్ కు వచ్చినట్లే 1038 మార్కులు వచ్చాయి, మరి.. ఇద్దరికి ఒకే మార్కులు వచ్చినప్పుడు దేని ఆధారంగా ఒకరికి సెకండ్ ర్యాంకు.. రెండో వారికి మూడో ర్యాంక్ అన్నది చూస్తే.. రాతపరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి మెరుగైన ర్యాంక్ ను కేటాయిస్తారు.

నాలుగో ర్యాంకర్ షా మార్గి చిరాగ్ కు 1035 మార్కులు.. ఐదో ర్యాంకర్ ఆకాశ్ గార్గ్ కు 1032.. ఆరో ర్యాంకర్ కోమల్ పునియాకు 1032.. ఏడో ర్యాంకర్ ఆయుషీ బన్సల్ 1031.. ఎనిమిదో ర్యాంకర్ రాజ్ క్రిష్ణ ఝూ 1031 మార్కులు.. తొమ్మిదో ర్యాంకర్ ఆదిత్య విక్రమ్ అగర్వాల్ కు1027.. పదో ర్యాంకర్ మయాంక్ త్రిపాటికి 1027 మార్కులు వచ్చాయి. టాపర్ నుంచి టాప్ 10 ర్యాంకులు సాధించిన వారిని చూస్తే.. వారి మధ్య మార్కుల వ్యత్యాసం చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒక్క టాపర్ కు సెకండ్ ర్యాంకర్ కు మధ్య మాత్రమే 5 మార్కులు తేడా ఉంది. మిగిలిన వారికి చూస్తే.. సమానంగా ఉండటం.. లేదంటే ఒక మార్కు తేడా ఉండటం కనిపిస్తుంది.