Begin typing your search above and press return to search.

ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

ఇండియా పేరును భారత్‌ గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:35 AM GMT
ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!
X

ఇండియా పేరును భారత్‌ గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును సెప్టెంబర్‌ 18 నుంచి మొదలయ్యే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో పెడతారని టాక్‌ నడుస్తోంది. ఢిల్లీలో జరగనున్న జీ–20 సదస్సుకు సంబంధించి విదేశీ నేతలకు పంపిన ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని పేర్కొనడంతో పేరు మారుస్తారనే వార్తలకు బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో ఇండియా పేరు మార్పుపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. కొందరు పేరు మార్చాల్సిందేనని ‘భారత్‌’ అని పెట్టాలని డిమాండ్‌ చేస్తుండగా.. మరికొందరు ‘ఇండియా’ అని ఉంచాలని అంటున్నారు. మరికొందరు ఇప్పుడు ఉన్నట్టే ఇండియా, భారత్‌ ఇలా రెండు పేర్లు ఉంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సాధారణ నెటిజన్లతోపాటు ప్రముఖులు సైతం తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా ఇండియా పేరును మార్చడానికి ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాకుండా ఉండటానికి 28 ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. దీన్ని నిర్వీర్యం చేయడానికి.. ప్రజల్లో దేశం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికే బీజేపీ ప్రభుత్వం పేరు మార్పుకు సిద్ధమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ కూటమిని చూసి మోడీ ప్రభుత్వం వణుకుతోందని ఎద్దేవా చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోడీ ప్రభుత్వం చేపడుతున్న మరో స్టంట్‌ గా దీన్ని అభివర్ణిస్తున్నాయి.

మరోవైపు ఇండియా పేరు మార్పు పై ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్, పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్‌.. భారత్‌ మాతా కీ జై అని ట్వీట్‌ చేశారు. ఇక పవన్‌ కళ్యాణ్‌.. గతంలో సైరా ఆడియో ఫంక్షన్‌ లో మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మనదేశం పేరు.. భారత్‌ అని.. బ్రిటిష్‌ వాళ్లు ఇండియాగా మార్చారని పవన్‌ ఆ సభలో వ్యాఖ్యానించారు.

తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి.. మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌ గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయన్నారు. జీ–20 సదస్సు కోసం ప్రెసిడెంట్‌ డిన్నర్‌ ఆహ్వాన పత్రికపై భారత్‌ అని ముద్రించారన్నారు. ఇందులో కొత్త ఏముంది? అని ప్రశ్నించారు. మనం తరుచుగా భారత్‌ అనే పదాన్ని ఉచ్చరిస్తున్నామని గుర్తు చేశారు. ఇంగ్లిష్‌ లో అయితే.. ‘‘ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌’’ అని, హిందీలో అయితే.. ‘‘భారత్‌ కా సంవిధాన్‌’’ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నామన్నారు. ప్రపంచానికి మన దేశం పేరు ఇండియాగానే తెలుసన్నారు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మమతా బెనర్జీ నిలదీశారు.

అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ స్పందిస్తూ.. రాష్ట్రపతి భవన్‌ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉందని వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ‘భారతదేశం అంటే.. రాష్ట్రాల సమాఖ్య (యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని ఉందన్నారు. ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది అని జైరామ్‌ రమేశ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ కూడా విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే ఇప్పటికిప్పుడు దేశం పేరు మార్చుతున్నారన్నారు.

ఇక ఒకప్పటి భారత్‌ డాషింగ్‌ ఓపెనర్‌.. వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇండియాను భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నానని వెల్లడించాడు. భారత క్రికెటర్ల జెర్సీపై కూడా భారత్‌ అని ముద్రించాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)ని కోరారు.

అలాగే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా ట్వీట్‌ చేశారు. రిపబ్లిక్‌ అఫ్‌ భారత్‌ గా దేశం పేరు మార్చడాన్ని స్వాగతించారు. మన నాగరికత అమృత కాలం వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.

అదేవిధంగా పేరును ఇండియా అని కాకుండా భారత్‌ అని పిలవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు.

కాగా ఇండియా అనే పేరును మార్చాల్సిందేనని బీజేపీ, హిందూ సంఘాలు, ఇతరులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్‌ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్‌’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. ఇలా ఇండియా పేరు మార్పుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌ మీడియా దద్దరిల్లుతోంది.