Begin typing your search above and press return to search.

యూపీని వణికించిన పిడుగులు... షాకింగ్ గా మృతులు!

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో టోర్నడోలు, భారీ వర్షాలు, వరదలు వణికించేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 July 2024 10:31 AM GMT
యూపీని వణికించిన పిడుగులు... షాకింగ్ గా మృతులు!
X

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో టోర్నడోలు, భారీ వర్షాలు, వరదలు వణికించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అగ్రరాజ్యం కఠిన సమస్యలు ఎదుర్కొంది. ఈ సమయంలో భారత్ లోనూ భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. ఇందులో భాగంగా... ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను అల్లాడించేస్తున్నాయి. ఈ సమయంలో పిడుగుపాట్లకు పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు!

అవును... ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈశాన్యంలోని అస్సాంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్ లో పిడుగుపాటు కారణంగా ఒక్కరోజులోనే ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోపక్క వేరు వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల వల్ల బుధవారం ఒక్కరోజే 38 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ మహిళ, చిన్నారులు కూడా ఉన్నారు. మరోపక్క రానున్న ఐదురోజుల్లో యూపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇలా ఉత్తరప్రదేశ్ లో పిడుగుపాటువల్ల మృతిచెందినవారిలో ప్రతాప్ గఢ్ లో అత్యధికంగా 11 మంది మరణించగా.. సుల్తాన్ పూర్ లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్ పురలో ఐదుగురు, ప్రయాగ్ రాజ్ లో నలుగురు, ఇతర జిల్లాల్లో ఒక్కో మరణం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మరోపక్క ముంబైలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పిడుగులు పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు!:

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఇంట్లోనే ఉండటం మంచిది. ఇందులో భాగంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ తో కూడిన మూసి ఉన్న నిర్మాణంలోకి వెళ్లడం ఉత్తమం!

సమీపంలో భవనం లేకుంటే... కారు, వ్యాను లేదా బస్సు వంటి మూసి ఉన్న మెటల్ వాహనంలోకి ఎక్కండి!

మీరున్న ప్రాంతంలో పిడుగులు పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉండవని గుర్తుంచుకోవాలి!

ఇదే సమయంలో ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ, ఇతర ఎలక్ట్రికల్ అవుట్ లెట్ కు కనెక్ట్ చేయబడిన ఏ ఎలక్ట్రానికి పరికరాలూ ఉపయోగించవద్దు.

ఒంటరిగా ఉన్న చెట్టు కింద ఎప్పుడూ ఆశ్రయం పొందొద్దు. విద్యుత్ లైన్లు, గాలిమరలు, ఇతర విద్యుత్ సరఫరా చేసే వస్తువులకు దూరంగా ఉండండి.