Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ లో యూపీఐ చెల్లింపులు.. ఎలా పని చేస్తుంది?

తాజాగా ఫ్రాన్స్ లోనూ యూపీఐ పేమెంట్స్

By:  Tupaki Desk   |   15 July 2023 6:18 AM GMT
ఫ్రాన్స్ లో యూపీఐ చెల్లింపులు.. ఎలా పని చేస్తుంది?
X

చేతిలో మొబైల్ ఫోన్. అందులో యూపీఐ యాప్. లేదంటే.. భీమ్ యాప్. దీన్ని ఓపెన్ చేసి.. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా ఇట్టే చెల్లింపులు జరపొచ్చు. అదే సమయంలో తమకు కేటాయించిన క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరినుంచైనా పేమెంట్ తీసుకునే వెసులుబాటు సగటు జీవికి ఉండటం తెలిసిందే. అందరికి తెలిసిందే ఇప్పుడెందుకు చెబుతున్నట్లు? అంటే.. కారణం లేకపోలేదు. యూపీఐ పేమెంట్స్ ను భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ పని చేస్తోంది.

తాజాగా ఫ్రాన్స్ లోనూ యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటం.. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫ్రాన్స్ పర్యటనలో ప్రకటించటం తెలిసిందే. ఫ్రాన్స్ వ్యాప్తంగా ఇకపై యూపీఐ చెల్లింపులు చేయొచ్చన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేందుకు వీలుగా ఈఫిల్ టవర్ వద్ద నుంచి యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

దీంతో.. భారత పర్యాటకులు.. చేతిలో యూరోలు లేకున్నా.. అమెరికన్ డాలర్లు లేకున్నా.. తమ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బును ఫ్రాన్స్ వ్యాప్తంగా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు వచ్చేసింది. అదే సమయంలో.. అక్కడి వారి నుంచి డబ్బులు స్వీకరించే సులువైన మార్గం వచ్చేసింది. దీంతో..ఫ్రాన్స్ ను సందర్శించే పర్యాటకులతో పాటు.. విద్యార్థులకు సులువైన పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్లైంది. ఫ్రాన్స్ లో ఆ దేశ కరెన్సీకి బదులుగా మన రూపాయిల్లోనే డిజిటల్ పద్దతిలో పే మెంట్స్ చేసుకునేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవటమే దీనికి కారణం.

ఇప్పుడంటే ఫ్రాన్స్ కానీ.. దీనికి ముందు యూకే.. యూఏఈ.. భూటాన్..నేపాల్.. సింగపూర్.. ఆస్ట్రేలియా.. ఒమన్ ల్లోనూ యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా యూఎస్.. ఐరోపాకు చెందిన దేశాలతో పాటు.. పశ్చిమ ఆసియా దేశాలతోనూ యూపీఐను వినియోగించుకునేందుకు వీలుగా భారత్ చర్చలు జరుపుతోంది.

ఫ్రాన్స్ తో యూపీఐ చెల్లింపులు ఎలా సాధ్యమైందన్న విషయానికి వస్తే.. అక్కడి లైరా నెట్ వర్క్స్ తో యూపీఐను నిర్వహిస్తున్న ఎన్ పీసీఐ 2022లో ఒప్పందం చేసుకుంది. అనంతరం దానికి తగ్గ వ్యవస్థను సిద్ధం చేశారు.

దీంతో.. యూపీఐ ద్వారా పేమెంట్స్ కు భారత ఫోన్ నెంబర్లు మాత్రమే కాదు.. విదేశాలకు చెందిన ఫోన్ నెంబర్ల ద్వారా కూడా పేమెంట్స్ చేసే వెసులుబాటు కలిగింది. ఈ కారణంగా కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా తగ్గటంతో పాటు.. రెండు దేశాల మధ్య రెమిటెన్స్ ఖర్చులు తగ్గనున్నట్లు చెబుతున్నారు. యూపీఐ అంతర్జాతీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రోజువారీ చెల్లింపులు భారీగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంటే.. 2025 నాటికి రోజువారీ లావాదేవీలు 100 కోట్లుకు చేరుకునే వీలుందని చెబుతున్నారు.