యూపీఐ పేమెంట్స్ కి ఛార్జీలు!.. వివరాలివే!
అవును... రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోన్న యూపీఐ లావాదేవీల విషయంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 11 Jun 2025 4:04 PM ISTయూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. క్యాష్ లెస్ లావాదేవీలు ఇప్పుడు రెగ్యులర్ గా యూపీఐ పేమెంట్స్ గానే ఉంటున్నాయి. తోపుడు బండ్లపై పూలు, పండ్లు దగ్గర నుంచి టీ షాపు, కిరాణా దుకాణంలో చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలపై ఛార్జీలు ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అవును... రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోన్న యూపీఐ లావాదేవీల విషయంలో కేంద్రం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... త్వరలోనే ఈ లావాదేవీలపై ప్రస్తుతానికి ఎలాంటి ఛార్జెస్ లేకపోగా.. త్వరలో మర్చెంట్ ఛార్జెస్ ను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నేషనల్ మీడియా తన కథనంలో వెల్లడించింది. దీంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందని ఆ కథనం పేర్కొంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీ విలువ ఆధారంగా ఈ ఛార్జెస్ ను విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... యూపీఐ ద్వారా రూ.3,000కు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. తక్కువ అమౌంట్ యూపీఐ లావాదేవీలపై ఛార్జెస్ మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. అధిక విలువ గల లావాదేవీలపై మాత్రం త్వరలోనే ఛార్జెస్ విధించనున్నారని అంటున్నారు. ఇది 0.3%గా ఉండాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిందని చెబుతున్నారు.
కాగా... ప్రస్తుతం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై ఛార్జెస్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. 'రూపే' కార్డులపై ప్రస్తుతానికి ఛార్జెస్ విధించే ప్రసక్తి లేదని అంటున్నారు. బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం ఈ ఛార్జెస్ పై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే... ఈ ఛార్జెస్ వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. కారణం... ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరని చెబుతున్నారు.