అలవాటు చేశారు.. ఇక, బాదేస్తున్నారు!
ఇదే సమయంలో ఏటీఎంల ద్వారా.. కేవలం 25 నుంచి 50 వేల వరకు మాత్రమే విత్ డ్రాకు అవకాశం కల్పించారు. దీంతో ప్రజలు యూపీఐకి బాగా జోరుగా అలవాటు పడ్డారు.
By: Tupaki Desk | 12 Jun 2025 12:58 AM ISTకార్పొరేట్ తరహా ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ముందు ఉచితాలు ప్రకటిస్తారు. వీటికి ప్రజలు అలవాటు పడతారు.. ఇక, జనాలు తప్పించుకునే పరిస్థితి లేకుండా చేసిన తర్వాత.. బాదుడు మొదలు పెడతారు. కార్పొరేట్ వ్యాపారాలు దాదాపుగా ఇలానే ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారు కూడా.. యూపీఐ పేమెంట్ల వ్యవహారంలో అచ్చం ఇలానే చేస్తోంది. 2016, అక్టోబరులో పెద్దనోట్లనురద్దు చేసిన దరిమిలా.. వెంటనే `యూపీఐ`(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)ను ప్రజలకు మప్పేసింది. రూపాయి విలువైన వస్తువుకు కూడా.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వివిధ చెల్లింపు మాధ్యమాలను తీసుకువచ్చింది.
దీంతో చేతిలో స్మార్టు ఫోను ఉన్నవారికి అదే పర్సుగా మారిపోయింది. అంతేకాదు.. అదే పెద్ద బ్యాంకుగా మారిపోయింది. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా.. ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా.. ఫోన్ చేతిలో ఉంటే చాలు! అనే పద్ధతికి దేశవ్యాప్తంగా 80 శాతం మంది ప్రజలు అలవాటు పడ్డారు. ఇక, వాణిజ్య లావాదేవీలను చూసినా.. 62 శాతం కొనుగోళ్లు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. మరోవైపు నగదు విత్‌డ్రాలపైనా ఆంక్షలు విధించారు. అంటే.. ఫోన్ పేలో ఎంతైనా ఎవరికైనా రోజు రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు పంపుకునే వెసులు బాటు కల్పించారు.
ఇదే సమయంలో ఏటీఎంల ద్వారా.. కేవలం 25 నుంచి 50 వేల వరకు మాత్రమే విత్ డ్రాకు అవకాశం కల్పించారు. దీంతో ప్రజలు యూపీఐకి బాగా జోరుగా అలవాటు పడ్డారు. ఇప్పుడు నగరాలు, పట్టణాల పరిధిలోని ఒక వంద మందిని పరిగణనలోకి తీసుకుంటే.. 80 మంది వరకు ఫేన్ పే, లేదా గూగుల్ పే , పేటీఎంలపైనే ఆధారపడుతున్నారు. అంతేకాదు.. అసలు ఇవి లేవంటే వింతగా కూడా చూసే పరిస్థితి వచ్చింది. ఇలా.. అలవాటు చేసిన కేంద్రం ఇప్పుడు బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మొదట్లో యూపీఐ పేమెంట్ల ద్వారా అవినీతి తగ్గుతుందని.. నగదు చలామణి అదుపులోకి వస్తుందని కేంద్రం చెప్పింది.
అయితే.. ఇప్పుడు దీని వెనుక కీలకమైన బాదుడు తెరమీదికి వచ్చింది. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలకు ప్రయోజనం చేకూర్చే యోచనలో భాగంగా రూ.3,000లకు పైగా చేసే పేమెంట్స్‌పై ఛార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. అంటే.. ఎవరైనా తమ ఫోన్ల నుంచి ఫేన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా.. రూ.3000 లకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే.. చార్జీలు బాదేస్తారు. అది ఎంత అనేది ప్రస్తుతం సస్పెన్సులో పెట్టినా.. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది. మరి దీనిని ప్రజలు భరిస్తారో లేదా తిరగబడతారో చూడాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ(అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం).. రూ.10000 విత్ డ్రాచేసిన వారి నుంచి రూ.10 వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. కానీ, ఇది బెడిసి కొట్టింది. దీంతో సర్కారే కూలిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
