Begin typing your search above and press return to search.

ఆగస్ట్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఆ మూడు సర్వీసులు ఇకపై లిమిటెడ్

డిజిటల్ చెల్లింపులలో సంచలన విప్లవం సృష్టించిన యూపీఐ (UPI) సేవల్లో 2025 ఆగస్టు 1 నుంచి కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   27 May 2025 10:44 AM IST
ఆగస్ట్ 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఆ మూడు సర్వీసులు ఇకపై లిమిటెడ్
X

డిజిటల్ చెల్లింపులలో సంచలన విప్లవం సృష్టించిన యూపీఐ (UPI) సేవల్లో 2025 ఆగస్టు 1 నుంచి కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1 నుంచి కొత్త ఏపీఐ (API) నియమాలను అమలు చేయనుంది. ఈ మార్పుల వల్ల యూపీఐ వినియోగదారులు ప్రస్తుతం పొందుతున్న కొన్ని సౌకర్యాలు పరిమితం కాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు, పేటీఎం, ఫోన్‌పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాలెన్స్ చెక్ చేయడం, ఆటోపేమెంట్స్, లావాదేవీల స్టేటస్ చెక్ వంటి సేవలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఆగస్టు 1, 2025 తర్వాత ఏమేం మారతాయనేది వివరంగా తెలుసుకుందాం.

ఇకపై యూజర్లు ఒక రోజులో ఒకే యూపీఐ యాప్ నుంచి గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోగలరు. రెండు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తున్నట్లయితే.. ప్రతి యాప్ నుండి విడివిడిగా 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే, మొత్తం 100 సార్లు. దీనికంటే ఎక్కువ సార్లు బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవడానికి వీలుండదు.

ఆటోపే (AutoPay) ద్వారా జరిగే చెల్లింపులకు ఇకపై టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పీక్ అవర్స్‌లో అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఆటోపేమెంట్స్ జరగవు. ఈ చెల్లింపులు కేవలం నాన్-పీక్ అవర్స్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. దీని వల్ల మీ ఆటోపేమెంట్ షెడ్యూల్‌లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు.. నెలవారీ బిల్లులు లేదా సబ్‌స్క్రిప్షన్ పేమెంట్స్ ఆలస్యంగా ప్రాసెస్ కావచ్చు.

ఒక లావాదేవీ ఏదైనా నెట్‌వర్క్ సమస్య వంటి నిర్దిష్ట లోపాల (error codes) కారణంగా విఫలమైతే దాని స్టేటస్‌ను పదే పదే చెక్ చేయడానికి చేసే ఏపీఐ కాల్స్‌ను నిలిపివేస్తారు. అంటే, యూజర్లు వెంటనే తమ పేమెంట్ విజయవంతమైందా లేదా విఫలమైందా అని తెలుసుకోలేరు. దీని వల్ల కొంత గందరగోళం ఏర్పడవచ్చు.

యూజర్లు తమ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ల జాబితాను ఒక యాప్ నుంచి ఒక రోజులో 25 సార్లు మాత్రమే చెక్ చేసుకునే వీలుంటుంది. ఈ అభ్యర్థన (request) అప్పుడే పనిచేస్తుంది. యూజర్ తన బ్యాంక్‌ను ఎంచుకుని దానికి తన సమ్మతిని తెలియజేసిన తర్వాతే ప్రాసెస్ అవుతుంది.

NPCI బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు (PSPs) తమ ఏపీఐ వాడకాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ నియమాలను పాటించకపోతే వారికి ఏపీఐ రిస్ట్రిక్షన్స్, పెనాల్టీలు లేదా కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడానికి తాత్కాలిక నిషేధం వంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని PSPలు 2025 ఆగస్టు 31 నాటికి తమ సిస్టమ్ ఆడిట్ అండర్‌టేకింగ్ (undertaking)ను ఇవ్వాలని NPCI ఆదేశించింది.

ఈ మార్పుల వల్ల యూజర్లు తరచుగా బ్యాలెన్స్ చెక్ చేయడం, ఆటోపే సెటప్ చేయడం లేదా లావాదేవీల స్టేటస్‌ను చెక్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు NPCI చెబుతోంది.