Begin typing your search above and press return to search.

ఉప రాష్ట్రపతి ఎన్నిక... వార్ వన్ సైడ్ కాదా..?

అవును... త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంటులో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 July 2025 8:26 AM IST
ఉప రాష్ట్రపతి ఎన్నిక...  వార్  వన్  సైడ్  కాదా..?
X

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు (జూలై 21 - 2025)న ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జరుగుతున్న రాజకీయ చర్చలు, విశ్లేషణల సంగతి అలా ఉంచితే... త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సమయంలో... పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయే బలంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఎన్నికకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని పార్లమెంటులో ఎన్డీయే కూటమి కలిగి ఉంది. ఈ సమయంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచన చేస్తుందని అంటున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది!

అవును... త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్లమెంటులో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ... ఎన్నికలో పోటీ చేసే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉమ్మడి అభర్థిపై సమిష్టి నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

వాస్తవానికి.. లోక్‌ సభలో పశ్చిమ బెంగాల్‌ లోని బసీర్‌ హాట్‌ సీటు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం 542 మంది సభ్యులున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. వారితో పాటు నలుగురు నామినేటెడ్‌ సభ్యులతో కలిపి 244 మంది ఉన్నారు. ఆ విధంగా ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786 గా ఉంది.

ఇందులో ఉప రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 394 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ విషయంలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో... ఎన్డీయేకు లోక్‌ సభలో 293 మంది రాజ్యసభలో 129 మంది సభ్యుల బలముంది. అంటే... 422 మంది సభ్యులు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు. దీంతో.. ఎన్నికలో గెలుపు లాంఛనమే అన్నమాట!

మరోవైపు విపక్ష కూటమికి లోక్‌ సభలో 234 మంది, రాజ్యసభలో 79 మంది కలిపి 313 మంది సభ్యుల బలం ఉంది. ఇలా ఉభయ సభల్లోనూ మెజారిటీ లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం దిశగా ఆలోచన అని చెబుతున్నారు!