Begin typing your search above and press return to search.

రావ‌ణ్‌పై 'ఉగ్ర‌వాద‌' కేసు.. పోలీసుల అత్యుత్సాహ‌మా?

గ‌త నాలుగు రోజులుగా వార్త‌ల్లో ఉన్న యూట్యూబ‌ర్ రావ‌ణ్‌పై కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం పోలీసులు ఇత‌ర సెక్ష‌న్ల‌తో పాటు కీల‌క‌మైన 'ఉపా' కేసు న‌మోదు చేశారు.

By:  Garuda Media   |   6 July 2026 3:08 PM IST
రావ‌ణ్‌పై ఉగ్ర‌వాద‌ కేసు.. పోలీసుల అత్యుత్సాహ‌మా?
X

"భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను సద్వినియోగం చేసుకునేవారితోపాటు.. ఉల్లంఘించే వారు కూడా దేశంలో ఉన్నారు. అలాగ‌ని వారిని ఉగ్ర‌వాదుల్లా.. తీవ్ర‌వాదుల్లా.. సంఘ విద్రోహ శ‌క్తుల్లా చూస్తారా?" అంటూ నిరుడు సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసి.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. తాజాగా ఇదే కేసు ఏపీలోనూ న‌మోదైంది. గ‌త నాలుగు రోజులుగా వార్త‌ల్లో ఉన్న యూట్యూబ‌ర్ రావ‌ణ్‌పై కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం పోలీసులు ఇత‌ర సెక్ష‌న్ల‌తో పాటు కీల‌క‌మైన 'ఉపా' కేసు న‌మోదు చేశారు.

ఏంటీ కేసు?

ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్ట‌మే ఉపా. దీని కింద ఉగ్ర‌వాదుల‌కు సాయం చేయ‌డం.. ఉగ్ర‌వాద స‌మాచారాన్ని పంచుకోవ‌డం, దేశ భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగించేవారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఉపా చ‌ట్టాన్ని ప్ర‌యోగించాల‌ని సుప్రీంకోర్టు స‌హా.. కేంద్రం కూడా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది. అయితే..ఈ చ‌ట్టం దుర్వినియోగం వ్య‌వ‌హారం త‌ర‌చుగా చ‌ర్చ‌కు కూడా దారితీస్తోంది. ఇప్పుడు రావ‌ణ్ పై ఈ కేసు న‌మోదు కావ‌డంతో జాతీయ మీడియా వ‌ర‌కు రావ‌ణ్ పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని న్యాయ‌వాదులు, నిపుణులు కూడా చెబుతున్నారు.

రావ‌ణ్ త‌న భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను ఉల్లంఘించార‌న్న‌ది ఆరోప‌ణ‌. ఇది ఆయ‌న వీడియోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. పోలీసులు కూడా అక్క‌డికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. పైగా ఒకే వ్య‌వ‌హారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు న‌మోదు చేయ‌డం.. ప‌దే ప‌దే అరెస్టులు వంటివి చూసేందుకు బాగున్నా.. రేపు న్యాయ స్థానాల ముందు పోలీసులు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అనేక తీర్పులు ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టం కింద‌కేసులు న‌మోదు చేయ‌డం మ‌రింత దారుణంగా ఉంది.

ఎవ‌రికి న‌ష్టం?

పోలీసులు ఏం చేసినా.. ఎలా వ్య‌వ‌హ‌రించినా.. అంతిమంగా ప్ర‌భుత్వానికే ఇబ్బంది. రేపు హోం శాఖ దీనిపై స‌మాధానం చెప్పాల్సి వుంటుంది. క‌ర్ణాట‌క నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కు ఉపా చ‌ట్టం వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు వ్య‌వ‌హ‌రించిన తీరు.. చేసిన వ్యాఖ్య‌లు గుర్తుండే ఉంటాయి. సో.. ఏదైమైనా.. కొన్ని కొన్ని కేసుల్లో సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం పోలీసుల‌పైనా.. వారిని గాడి త‌ప్ప‌కుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైనా ఉంది. లేక‌పోతే..రేపు స‌మాధానం చెప్పాల్సింది ప్ర‌భుత్వ‌మేన‌న్న విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు.