లేటు వయసులో ఘాటు ప్రేమ.. మనవడిని పెళ్లాడిన 50ఏళ్ల మహిళ
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Desk | 2 May 2025 2:00 AM ISTఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 50 ఏళ్ల వయస్సున్న ఒక మహిళ తన భర్తను, నలుగురు పిల్లలను వదిలి, 30 ఏళ్ల వయస్సున్న తన మనవడి వరుస వాడైన యువకుడిని వివాహం చేసుకుంది. ఈ అసాధారణమైన ప్రేమ కథలో అనేక అనూహ్యమైన మలుపులు ఉన్నాయి.
అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన ఇంద్రావతికి భర్త చంద్రశేఖర్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆమె తన కుటుంబ బంధాలను తెంచుకుని, వరుసకు మనవడు అయిన ఆజాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఒక గుడిలో జరిగింది. పెళ్లి తర్వాత ఇంద్రావతి తన కుటుంబాన్ని శాశ్వతంగా వదిలి ఆజాద్‌తో వెళ్లిపోయింది. ఆజాద్, ఇంద్రావతి మొదట గోవింద్ సాహిబ్ గుడికి వెళ్లి అక్కడ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ ఒకే ప్రాంతంలో నివసించేవారు. మొదట్లో వారి మధ్య స్నేహం ఉండేదని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. వారు బంధువులు కావడంతో వారి కలయికను ఎవరూ అనుమానించలేదు. అయితే ఇంద్రావతి, ఆజాద్ ఇంటి నుండి పారిపోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నారు. ఒకసారి ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ వారిని రహస్యంగా మాట్లాడుకుంటుండగా పట్టుకున్నాడు. దీంతో వారి సంబంధం బయటపడింది. చంద్రశేఖర్ వారిని మందలించినప్పటికీ వారు వినలేదు. చేసేది లేక ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారు.
ఇక్కడే కథ ముగియలేదు. ఇంద్రావతి , ఆజాద్ తమ బంధానికి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌ను చంపడానికి కూడా కుట్ర పన్నారు. అంతేకాదు, తమ పిల్లలకు కూడా విషమిచ్చి చంపాలని పథకం వేశారు. అయితే ఈ విషయం చంద్రశేఖర్‌కు తెలియడంతో నిలదీయగా, వారు తమ మాట మార్చారు. చంద్రశేఖర్‌కు ఇంద్రావతి రెండవ భార్య. చంద్రశేఖర్ ఉద్యోగరీత్యా తరచూ ఊర్లో ఉండడు. దీనిని అవకాశంగా తీసుకున్న ఇంద్రావతి ఆజాద్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. చివరికి వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తన భార్య తనను, పిల్లలను వదిలి వెళ్లిపోవడంతో చంద్రశేఖర్, పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
