చెప్పుల కోసం 50 వేలు డిమాండ్.. ఇవ్వనందుకు వరుడికి దేహశుద్ధి!
పెళ్లి తర్వాత వధువు తరపు బంధువులు వరుడి చెప్పులు దాచిపెట్టి సరదాగా ఆట పట్టించడం సాధారణంగా జరిగే ఆచారం.
By: Tupaki Desk | 7 April 2025 11:40 AM ISTపెళ్లి తర్వాత వధువు తరపు బంధువులు వరుడి చెప్పులు దాచిపెట్టి సరదాగా ఆట పట్టించడం సాధారణంగా జరిగే ఆచారం. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సరదా కాస్తా విషాదంగా మారింది. చెప్పులు దాచిపెట్టినందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, వరుడు కేవలం రూ.5 వేలు ఇవ్వడంతో వధువు తరపు బంధువులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటన పెళ్లింట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు చెందిన ముహమ్మద్ షబీర్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత, ‘జూతా చుపాయి’ (చెప్పులు దాచడం) ఆచారం నిర్వహించారు. వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులను దాచిపెట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే, వరుడు వారి డిమాండ్‌కు అంగీకరించకుండా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో వధువు తరపు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిని బిచ్చగాడిలా ఇంత తక్కువ డబ్బు ఇచ్చావేంటంటూ తీవ్రంగా దూషించారు. ఈ అవమానంతో కోపోద్రిక్తుడైన వరుడి తరపు బంధువులు, వధువు కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన బంగారం నాణ్యత గురించి ప్రశ్నించారు.
ఈ చిన్న వివాదం కాస్తా ఇరు కుటుంబాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. వధువు బంధువులు మరింత రెచ్చిపోయి వరుడిని ఒక గదిలో బంధించి కర్రలతో కొట్టారు. ఈ ఘటనతో పెళ్లింట ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.
ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, చివరకు రాజీ కుదిర్చినట్లు తెలిపారు. అయితే, సరదాగా మొదలైన ఒక ఆచారం ఇలాంటి చేదు అనుభవానికి దారితీయడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ఆ వివాహ జంటకు మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
