Begin typing your search above and press return to search.

పెళ్లైన 15రోజులకే ముగ్గురు పిల్లలున్న మహిళతో రెండో పెళ్లి!

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఉదంతాలను చూస్తుంటే.. నోటి వెంట మాటలు రానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   23 April 2025 11:22 AM IST
UP Man Marries Woman Cop 15 Days After First Wedding
X

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఉదంతాలను చూస్తుంటే.. నోటి వెంట మాటలు రానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. తెలిసి మరీ తప్పులు చేయటం.. అది కూడా గౌరవనీయస్థానాల్లో ఉన్న వారుచేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. తాజాగా ఆ తరహా ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

యూపీలోని హాపుడ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ మధ్యన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాతే అసలుసిసలు ట్విస్టు చోటు చేసుకుంది. పెళ్లైన పదిహేను రోజులకు ముగ్గురు పిల్లలు ఉన్న మహిళా కానిస్టేబుల్ ను పెళ్లాడిన వైనం సంచలనంగా మారింది. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా ఈ అంశం వెలుగు చూసింది. బాబుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నవీన్ అనే వ్యక్తితో బాధితురాలికి ఫిబ్రవరి 16న పెళ్లైంది. అనంతరం రెండు రోజులకే తన భర్తకు ముగ్గురు పిల్లలు ఉన్న మహిళా కానిస్టేబుల్ నిర్మలతో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గ్రహించింది. ఇదిలా ఉండగా.. మార్చి ఒకటిన నవీన్ సదరు మహిళా కానిస్టేబుల్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన రెండో భార్య నిర్మలతో కలిసి ఉండాలని బాధితురాలి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు.

దీంతో ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో మహిళా కానిస్టేబుల్ నిర్మలను హఫీజ్ ఫుర్ పోలీస్ స్టేషన్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం నవీన్.. నిర్మలలు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. స్థానికంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.