Begin typing your search above and press return to search.

మతం మారి పెళ్లి చేసుకున్న యూపీ వ్యాపారి కొడుకు.. భార్య, మామ అరెస్టు

ప్రస్తుతం ఆయుష్ మాలిక్ తన పేరును మహ్మద్ అలీ అలియాస్ రెహమాన్ గా మార్చుకున్నట్లు చెబుతున్నారు.

By:  Garuda Media   |   10 Jun 2026 11:00 AM IST
మతం మారి పెళ్లి చేసుకున్న యూపీ వ్యాపారి కొడుకు.. భార్య, మామ అరెస్టు
X

ఉత్తరప్రదేశ్ లో ఒక పెళ్లి ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున చర్చకు.. రచ్చకు కారణం కావటం గమనార్హం. హిందు యువకుడు ఒకరు మతం మారి.. ఇస్లాంలో చేరి.. ముస్లిం మహిళను పెళ్లాడిన వైనం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. తమ కొడుకును ప్రేమవలలో చిక్కుకునేలా చేసి.. అక్రమంగా మతం మార్పించారన్న యువకుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో అతడి భార్యను.. ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేయటం ఈ ఇష్యూలో మరో సంచలనమైంది. మతం మారిన హిందూ యువకుడు.. యూపీలోని షామ్లీ జిల్లాలో పేరు మోసిన వ్యాపారి కుటుంబానికి చెందిన వాడే కాదు.. కోట్లాది ఆస్తులకు వారసుడు కూడా కావటం గమనార్హం.

తన భార్యను.. మామను అక్రమంగా అరెస్టు చేశారని.. ఎవరో చెబితే తాను మతం మారలేదని.. తన ఇష్టంతోనే మారినట్లుగా సదరు యువకుడు ప్రకటించి.. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. ఇంతకు ఆ యువకుడు ఎవరు? ఆ యువతి ఎవరు? మతం ఎందుకు మారారు? వ్యాపారి కొడుకు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతను పెళ్లాడిన యువతి నేపథ్యం ఏంటి? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఈ వివాదం ఇప్పుడు ఎందుకింత పెద్దదైంది? లాంటి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ వ్యాపారి దేవరాజ్ మాలిక్. ఆయన జిల్లా ఫార్మాస్యూటికల్ సంఘంలోకీలక స్థానంలో ఉన్నారు. వీరికి పెద్ద ఎత్తున వ్యాపారాలు.. ఆస్తులు ఉన్నాయి. అతడి ఒక్కగానొక్క కొడుకు 30 ఏళ్ల ఆయుష్ మాలిక్. ఇటీవల ఇతను మతం మారి.. ముస్లిం మహిళను పెళ్లాడిన విషయం వెలుగు చూసింది. దీంతో.. ఇదో ఇష్యూగా మారటమే కాదు పెద్ద రచ్చకు దారి తీసింది.

ఇంతకూ ఈ వివాదం ఎలా వెలుగు చూసిందన్న విషయంలోకి వెళితే.. ఇటీవలి ఈద్ పండుగ సందర్భంగా ఆయుష్ మాలిక్ ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో నమాజ్ చేస్తున్న ఫోటోలు.. వీడియోలు బయటకు రావటంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై హిందూ సంఘాలు ఫోకస్ పెట్టటం.. ఆయన తల్లిదండ్రులు తమ కొడుకు పెళ్లాడిన యువతి మీదా.. ఆమె కుటుంబం మీదా సంచలన ఆరోపణలు చేయటంతో ఈ ఉదంతం మరింత వివాదంగా మారింది.

ప్రస్తుతం ఆయుష్ మాలిక్ తన పేరును మహ్మద్ అలీ అలియాస్ రెహమాన్ గా మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ పోలీసులకు ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.సుమారు ఐదేళ్ల క్రితం తన కొడుకు కాలికి గాయమైతే.. చికిత్స తీసుకునేందుకు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగి సోదరి కం ఫిజియోథెరపిస్ట్.. జిమ్ ట్రైనర్ అయిన చాందిని ఖురేషితో పరిచయం ఏర్పడినట్లుగా పేర్కొన్నారు. ఆమె ఆయుష్ ను ప్రేమవలలో చిక్కునేలా చేసిందని.. కొన్ని ప్రైవేటు వీడియోలను చూపించి బ్లాక్ మొయిల్ చేసి బలవంతంగా మతమార్పిడి చేయించి.. పెళ్లి చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.

తమ కోట్లాది రూపాయిల ఆస్తులపై కన్నేసి.. ఈ కుట్రకు తెర తీసినట్లుగా ఆరోపించారు. ఆయుష్ తమ ఒక్కగానొక్క కొడుకుగా పేర్కొన్న దేవరాజ్..పాకిస్తాన్ కు చెందిన మత బోధకుడు ఇస్రతార్ అహ్మద్ యూట్యూబ్ వీడియోలను చూపించి తమ కొడుక్కి తీవ్రమైన బ్రెయిన్ వాష్ చేసినట్లుగా ఆరోపించారు. అంతేకాదు.. తప్పుడు పత్రాలతో ఢిల్లీలోని ఒక మసీదులో రహస్యంగా పెళ్లి జరిపించినట్లు పేర్కొన్నారు. ఈ ఇష్యూలో ఇప్పటివరకు ఆయుష్ సతీమణి.. మామను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ వివాదం అంతకంతకూ ముదిరిన నేపథ్యంలో ఆయుష్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో ప్రకటన చేశాడు. తాను ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని.. బలవంతంగా ఇస్లాం స్వీకరించలేదన్న అతను.. పూర్తి ఇష్టపూర్వకంగా.. స్వచ్చందంగానే మతం మారినట్లుగా పేర్కొన్నారు. తనకు చిన్నప్పటి నుంచే ఇస్లాం మీద ఆసక్తి ఉందని.. ఆ మత గ్రంధాలు.. ఆన్ లైన్ ఉపన్యాసాలు చదివి ఇస్లాం వైపు ఆకర్షితులైనట్లుగా పేర్కొన్నారు.

సుమారు నాలుగేళ్ల క్రితమే తాను మతం మారినట్లుగా వెల్లడించాడు. అప్పట్లోనే చాందినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నానని.. ఇంట్లో తన సోదరీమణుల పెళ్లిళ్లు జరగని కారణంగా ఆ విషయాల్నిబయటకు వెల్లడించలేదని చెప్పారు. అందుకే తన పెళ్లిని రహస్యంగా ఉంచినట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన తల్లిదండ్రులకు తన పెళ్లి విషయాన్ని వెల్లడించినట్లుగా చెప్పారు. తాను మేజర్ అని.. తనకు నచ్చినట్లుగా పెళ్లి చేసుకునే వీలుందన్న అతను.. అవసరమైతే తనకు తన తండ్రి ఆస్తులు వద్దని స్పష్టం చేశాడు. మొత్తంగా ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ లో తీవ్ర సంచలనానికి కారణమైందని చెప్పాలి.