Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుడి కంటే ధనవంతుడు.. బ్యాంకు తప్పిదంతో రైతు ఖాతాలో లక్షల కోట్ల డబ్బు!

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్న అజిత్ అనే రైతు తన బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 36 అంకెల బ్యాలెన్స్ చూసి షాక్‌ అయ్యాడు.

By:  Tupaki Desk   |   7 May 2025 7:00 AM IST
ప్రపంచ కుబేరుడి కంటే ధనవంతుడు.. బ్యాంకు తప్పిదంతో  రైతు ఖాతాలో లక్షల కోట్ల డబ్బు!
X

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్న అజిత్ అనే రైతు తన బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 36 అంకెల బ్యాలెన్స్ చూసి షాక్‌ అయ్యాడు. తన జీవితంలో కలలో కూడా ఊహించని ఈ సంఘటన అతడిని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఏప్రిల్ 24న అజిత్ అకౌంట్ నుంచి మొదట రూ.1,800, ఆ తర్వాత అదే రోజు రూ.1,400 డెబిట్ అయ్యాయి. అయితే, మరుసటి రోజు ఏప్రిల్ 25న అతని బ్యాంకు బ్యాలెన్స్ అక్షరాలా రూ.1,00,13,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542 గా కనిపించడంతో కేవలం అతని కుటుంబ సభ్యులే కాదు.. యావత్ గ్రామం విస్మయానికి గురైంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూసిన అజిత్ భార్య మొదట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వెంటనే మోసగాళ్ల బారిన పడతామేమోనన్న భయం ఆమెను ఆవహించింది.

దీని గురించి తెలుసుకోవడానికి అజిత్ బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా జమ్మూ కాశ్మీర్‌లోని ఒక బ్రాంచ్‌లో జరిగిన టెక్నికల్ ఎర్రర్ కారణంగా ఈ డబ్బు జమ అయిందని వారు తెలిపారు. అయితే, ఆ తర్వాత కూడా అదే బ్యాలెన్స్ కనిపించడంతో అజిత్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతడిని సైబర్ క్రైమ్ విభాగంలో మరో దరఖాస్తు సమర్పించమని కోరారు. ప్రస్తుతం అజిత్ ఖాతా ఫ్రీజ్ చేయడంతో తాను మోసపోయానని ఆందోళన చెందుతున్నాడు.

అజిత్ చూసిన ఈ మొత్తం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్‌ఎక్స్ సీఈఓ 14 అంకెల నికర విలువ (₹2,84,17,69,27,10,400) కంటే కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఒక సాధారణ రైతు అకౌంట్లో ఇంత అసాధారణమైన బ్యాలెన్స్ కనిపించడం బ్యాంకు వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. అజిత్ అకౌంట్లలోని నిధులను తిరిగి సరిచేసి, అతడికి జరిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించే అవకాశం ఉంది. అయితే, ఈ సంఘటన అజిత్, అతని కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.