ఐదేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు.. ఒళ్లు జలదరించే వీడియో!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసిన దారుణమైన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 10 July 2025 7:48 PM ISTవీధి కుక్కల భారిన పడి గాయపడుతున్న, మృత్యువాతపడుతున్న పిల్లల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు, ఎంతో ఘోరమైన ఘటనలు ఎన్ని జరుగుతున్నా ఈ విషయంలో ప్రభుత్వాలు సరైన చర్యలు, శాస్వత పరిష్కారాలు మాత్రం తీసుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఐదేళ్ల బాలుడిని కుక్కలు ఈడ్చుకెళ్లిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... మరో ఐదేళ్ల బాలుడు వీధికుక్కల బారిన పడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు షాకింగ్ గా మారాయి. వీధికుక్కల దాడి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. పెరుగుతున్న వీధికుక్కల బెడదపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ లో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసిన దారుణమైన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. అనిక్ అనే ఆ బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటుండగా, ఒక వీధి కుక్కల గుంపు అతనిపై దాడి చేసి, సుమారు 20 మీటర్లు రోడ్డుపైకి లాక్కెళ్లి క్రూరంగా కొరికింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు!
దాడి జరిగినప్పుడు అనిక్ తల్లి ఇంట్లోనే ఉండగా.. పొరుగు మహిళ ఆ పిల్లవాడిని వీధి కుక్కలు ఈడ్చుకెళ్లడం చూసి రక్షించడానికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ కుక్కలను తరిమికొట్టింది. అనంతరం, గాయపడిన ఆ పిల్లవాడిని తొలుత సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య కళాశాలకు తరలించారు.
జిల్లాలోని కస్య కొత్వాలి ప్రాంతంలోని అమియా త్రిపాఠి నగర్ లోని వార్డ్ నంబర్ 26లో జరిగిన ఈ భయానక క్షణం సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటనలో బాలుడికి 18 లోతైన గాయలు అయినట్లు చెబుతున్నారు.
