లౌకికవాదుల సొల్లుమాటలకు చెక్ పెట్టేయాల్సిన టైం వచ్చేసింది
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. ఇప్పటివరకు జరిగిన దాడులకు భిన్నమైంది.
By: Tupaki Desk | 25 April 2025 10:51 AM ISTలౌకికవాదం పేరుతో సూడో సెక్యూలర్ భావజాలాన్ని వండి వార్చే పార్టీలు.. కుహనా మేధావులు తరచూ వల్లె వేసే కొన్ని పడికట్టు మాటలు ఈ రోజున దేశంలో ప్రజల మధ్య పొరపొచ్చలకు కారణమైంది. ఇలాంటి వారి మాటల ట్రాప్ లో.. వారి రాజకీయ వ్యూహాల్లో కొన్ని పార్టీలు.. నేతలు చిక్కుకుపోయారు. సవాలు ఎదురైనప్పుడు.. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు.. కులం.. మతం..వర్గం.. ప్రాంతం. లాంటివి పక్కన పెట్టేసి ముందు మనమంతా భారతీయులమన్న ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. ఇప్పటివరకు జరిగిన దాడులకు భిన్నమైంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన దాడుల వేళ.. తాము చేసే మారణకాండకు బలి అయ్యే వాళ్లు ఎవరు? అన్నది తేడా లేకుండా చేసేవారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మాత్రం అందుకు భిన్నంగా.. నువ్వు ఏ మతానికి చెందిన వాడివి? అన్న ప్రశ్నను సంధించి.. తాము కోరుకున్న సమాధానం వస్తే వదిలేయటం.. లేదంటే పిట్టల్ని చంపినట్లుగా చంపేస్తూ మారణకాండకు పాల్పడ్డారు.
ఇలాంటి వేళలో.. దేశంలోని ముస్లింలు జరిగిన దారుణ ఘటనను ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. మతం పేరుతో విరుచుకుపడి.. దేశ ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టే కిరాతకానికి పాల్పడిన వారి చర్యను ఖండించాల్సిందే. ఇస్లాం అన్నది హింసను ప్రోత్సహించదన్న విషయాన్ని చాటి చెప్పాల్సిందే. ముస్లింలు తమ కమిట్ మెంట్ ను ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటి? అంటూ మాట్లాడేవారు కొందరు ఉంటారు.కానీ.. వారంతా మర్చిపోతున్న విషయం ఏమంటే.. ఈసారి జరిగిన ఉగ్రదాడి హిందూ - ముస్లింల మధ్య చిచ్చు రేపటం.. వారి మధ్యనున్న బంధాన్ని బలహీనపర్చే కుట్ర ఉందన్నది మర్చిపోకూడదు.
ఇలాంటి వేళలో.. దేశంలోని ముస్లింలు తమ సోదరులైన హిందువులపై జరిగిన మారణకాండను తాము ఖండిస్తున్నామని.. మతం పేరుతో చేసే ఈ తరహా రాక్షస చర్యల్ని తాము మద్దతు ఇవ్వమని.. ఉగ్రవాదులకు.. ఉగ్రసంస్థలకు వార్నింగ్ ఇచ్చేలా వీధుల్లోకి రావాల్సి ఉంటుంది. సోదరభావం ఒకవైపు నుంచి మాత్రమే ఎందుకు ఉండాలి? రెండువైపులా ఉంటుందన్న విషయాన్ని ముస్లింలు తమ చేతలతో చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ దేశంలో హిందువులు - ముస్లింలు ఇద్దరూ కలిసి కట్టుగా ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు.. హిందువుల కు కష్టం వస్తే తాము అండగా ఉన్నామని.. అదే సమయంలో ముస్లింలకు కష్టం వస్తే తాము నిత్యం అండగా నిలుస్తామన్న సందేశాన్ని భారతీయులుగా ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత వస్తున్న వీడియోలు.. చేస్తున్న వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మారణకాండకు పాల్పడ్డారని.. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలంటూ ఊదరగొడుతున్న వారు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు.
ఈ వాదన తప్పా.. రైటా? అన్నది ఇక్కడ చర్చ కాదు. ఎందుకుంటే.. ఇలా ఎవరికి వారు విభజనకు గురై.. రెండు సమూహాలుగా మారటం వల్ల ఉగ్రవాదులు ఈ దేశంలోని రెండు మతాలకు చెందిన ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టేందుకు చేసిన కుట్రను సక్సెస్ చేసిన వాళ్లమవుతాం. ఈ కోణాన్ని గుర్తించి దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పహల్గాం నరమేధానికి తాము వ్యతిరేకమని.. బాధితులైన హిందూ సోదరుల వెంట తాము ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్లాన్ చేసిన ఉగ్రసంస్థలకు వార్నింగ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఈ విషయాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
