పాము కాటుకు ఇకపై ఇంటిలోనే చికిత్స.. అద్భుతమైన క్యాప్సూల్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
అయితే, కెన్యాలో జరిగిన ఒక అద్భుతమైన పరిశోధన ఇప్పుడు దీనికి పరిష్కారం చూపనుంది.
By: Tupaki Desk | 28 April 2025 9:53 AM ISTభారతదేశంలో ప్రతేడాది విషపూరితమైన పాము కాటుకు గురై లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలా మందికి సరైన సమయంలో వైద్యం అందకపోవడమే ప్రధాన కారణం. అయితే, కెన్యాలో జరిగిన ఒక అద్భుతమైన పరిశోధన ఇప్పుడు దీనికి పరిష్కారం చూపనుంది. శాస్త్రవేత్తలు ఇకపై ఇంట్లోనే సులభంగా పాము విషాన్ని శరీరం నుంచి తొలగించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పాము కాటుకు యాంటీవెనమ్ ఉపయోగిస్తున్నారు. కాకపోతే దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. కానీ తాజాగా శాస్ట్రవేత్తలు కనిపెట్టిన కొత్త పద్ధతిలో ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
'ఈ-బయోమెడిసిన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదికలో.. పరిశోధకులు యూనిథియోల్ అనే ఔషధం పాము విషాన్ని నిర్వీర్యం చేయగలదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ఔషధాన్ని లోహ విషపూరితం (మెటల్ పాయిజనింగ్) చికిత్స కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. పాముల విషంలో మెటల్లోప్రోటీనేజ్ ఎంజైమ్ ఉంటుందని, ఇది కణాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్‌కు పనిచేయడానికి జింక్ అవసరం.. దానిని అది శరీరం నుండి గ్రహిస్తుంది. యూనిథియోల్ జింక్‌ను దారి మళ్లిస్తుంది. తద్వారా విషం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కూడా తీసుకోవచ్చని, దీనిని నిల్వ చేయడానికి సాధారణ ఉష్ణోగ్రత సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఇది క్యాప్సూల్ రూపంలో అందుబాటులోకి రావచ్చు.
ఇంతకు ముందు పాము విషాన్ని నిర్వీర్యం చేయడానికి తయారుచేసిన మందులన్నింటినీ నిల్వ చేయడానికి నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. ఇది మారుమూల గ్రామాల్లో సాధ్యం కాదు. ఈ కారణంగానే గ్రామాల్లో పాము కాటుకు ఎక్కువ మంది మరణిస్తున్నారు. కెన్యాలో 64 మందిపై ఈ ఔషధం ప్రయోగం విజయవంతంగా నిర్వహించబడినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ 64 మంది పాము కాటుకు గురైన తర్వాత యూనిథియోల్‌ను ఉపయోగించారు. వారందరూ త్వరగా కోలుకున్నారు. వారిలో పాము విషం ప్రభావం కనిపించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి వైద్య నిపుణుల సహాయం కూడా అవసరం లేదు. అంతేకాకుండా, తక్కువ, ఎక్కువ విషపూరితమైన పాములు కాటు వేసిన తర్వాత కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరిశోధన లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఒక గొప్ప ఔషధంగా పేర్కొవచ్చు.
